Vande Bharat: కాషాయ రంగులో ‘వందేభారత్‌’.. రైల్వే మంత్రి వివరణ ఇదే!

కేరళ (Kerala)లోని కాసర్‌గోడ్‌ నుంచి తిరువనంతపురం మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్‌ (Vande Bharat) రైలుకు కాషాయరంగు ఉండటాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానిపై రైల్వే మంత్రి తాజాగా వివరణ ఇచ్చారు. 

Published : 05 Oct 2023 01:57 IST

దిల్లీ: ఇటీవల కేరళలో ప్రారంభమైన వందేభారత్‌ (Vande Bharat) రైలుకు కాషాయ రంగు ఉండటం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. ఆ రంగును ఎంచుకోవడం వెనుక శాస్త్రీయ ఆలోచన ఉన్నట్టు చెప్పారు. ‘మనుషుల కళ్లకు రెండు వర్ణాలు బాగా కన్పిస్తాయి. ఒకటి పసుపు కాగా.. రెండోది ఆరెంజ్‌ రంగు. యూరప్‌లో దాదాపు 80 శాతం రైళ్లపై ఆరెంజ్‌ లేదా పసుపు, ఆరెంజ్‌ రంగులు కలగలిసి ఉంటాయి’ అని వివరించారు. 

వందే భారత్‌లో స్లీపర్‌ కోచ్‌లు.. ఫొటోలు షేర్‌ చేసిన కేంద్ర మంత్రి

వెండి వంటి చాలా రంగులు బాగా కన్పించినప్పటికీ మనుషుల కంటికి ఆరెంజ్‌, పసుపు మాత్రమే ఇంకా స్పష్టంగా కనబడతాయని అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. ఈ రంగు ఎంపిక వెనుక తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టంచేశారు. నూటికి నూరుశాతం శాస్త్రీయ ఆలోచన మాత్రమే ఉందని తెలిపారు. ఓడలు, విమానాల్లో వినియోగించే బ్లాక్‌ బాక్స్‌లు సైతం ఆరెంజ్‌ రంగులోనే ఉంటాయని ఆయన గుర్తు చేశారు. జాతీయ విపత్తు స్పందన దళం కూడా ఆ వర్ణంలో ఉండే జాకెట్లనే వినియోగిస్తుందని చెప్పారు. 

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 24న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలుగు రాష్ట్రాలు సహా పలుచోట్ల 9 వందేభారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. వాటిలో కాషాయరంగులద్దిన రైలు కేరళ రాష్ట్రం కాసర్‌గోడ్‌ నుంచి తిరువనంతపురం మధ్య రాకపోకలు సాగిస్తోంది. రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌కు కాషాయ రంగు పులిమిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో రైల్వే మంత్రి పైవిధంగా వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని