ఎయిర్‌పోర్టులో వీల్‌ఛైర్‌ లేక.. నడుచుకుంటూ వెళ్లి వృద్ధుడి మృతి

Mumbai airport: చక్రాల కుర్చీ అందుబాటులో లేకపోవడంతో విమానం వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్లిన ఓ వృద్ధుడు ఎయిర్‌పోర్టులో ప్రాణాలు కోల్పోయారు.

Updated : 16 Feb 2024 14:36 IST

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి ఎయిర్‌పోర్టు (Mumbai airport)లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చక్రాల కుర్చీ (wheelchair) అందుబాటులో లేకపోవడంతో 80 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. విమానం వద్ద నుంచి ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్‌ వద్దకు నడుచుకుంటూ వెళ్లి అక్కడే కుప్పకూలి చనిపోయారు. ఫిబ్రవరి 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అమెరికాలోని భారత సంతతికి చెందిన వృద్ధుడు గత సోమవారం తన భార్యతో కలిసి ఎయిరిండియా (Air India) విమానంలో న్యూయార్క్‌ నుంచి ముంబయి చేరుకున్నారు. టికెట్‌ కొనుగోలు సమయంలోనే వీరిద్దరూ వీల్‌ఛైర్‌ ప్రయాణికులుగా బుక్‌ చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో సరిపడా చక్రాల కుర్చీలు అందుబాటులో లేకపోవడంతో వీరికి ఒకటే ఇచ్చారు. అందులో తన భార్యను కూర్చోబెట్టిన అతడు.. ఆమె వెంట నడుచుకుంటూ వెళ్లాడు.

కెనడాలో హైదరాబాద్‌ విద్యార్థి మృతి

విమానం దిగిన ప్రాంతం నుంచి దాదాపు 1.5 కిలోమీటర్లు నడిచిన అతడు ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్‌ వద్దకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువీకరించారు.

ఘటనపై ఎయిరిండియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘‘ఇది దురదృష్టకర ఘటన. ఆ రోజు వీల్‌ఛైర్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. చక్రాల కుర్చీని ఏర్పాటు చేసే వరకు ఎదురుచూడాలని మేం ఆ ప్రయాణికుడికి చెప్పాం. కానీ, ఆయన తన భార్య వెంటే నడుచుకుంటూ వెళ్తానని చెప్పారు. మృతుడి కుటుంబంతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి అవసరమైన సాయం అందిస్తాం’’ అని ఎయిరిండియా తన ప్రకటనలో వెల్లడించింది. ఘటనపై ముంబయి ఎయిర్‌పోర్టు ప్రతినిధులు స్పందించలేదు.

న్యూయార్క్‌ నుంచి ముంబయి చేరుకున్న ఆ విమానంలో 32 మంది వీల్‌ఛైర్‌ కోసం బుక్‌ చేసుకున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. గ్రౌండ్‌ సిబ్బంది వద్ద కేవలం 15 మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని