Hyderabad Student: కెనడాలో హైదరాబాద్‌ విద్యార్థి మృతి

Hyderabad Student: హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి కెనడాలో కార్డియాక్‌ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు.

Updated : 16 Feb 2024 12:55 IST

హైదరాబాద్‌: ఉన్నత చదువుల కోసం కెనడా (Canada)కు వెళ్లిన హైదరాబాద్‌ వాసి (Hyderabad Student) కార్డియాక్‌ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ ఆ విద్యార్థి కుటుంబం కేంద్ర మంత్రి ఎస్‌. జైశంకర్‌ను అభ్యర్థించింది.

హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల షేక్‌ ముజమ్మిల్‌ అహ్మద్‌ 2022లో కెనడా వెళ్లాడు. ఒంటారియాలోని కొనెస్టోగా కాలేజీలో ఐటీ మాస్టర్స్‌ చదువుతున్నాడు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడు.. శుక్రవారం కార్డియాక్‌ అరెస్టు (Cardiac Arrest)తో మృతిచెందాడు. అతడి స్నేహితుడు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చినట్లు ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి అజ్మద్ ఉల్లా ఖాన్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. అహ్మద్‌ కుటుంబసభ్యులు కేంద్ర విదేశాంగ శాఖకు రాసిన లేఖను కూడా ఆయన పోస్ట్‌ చేశారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరారు.

కరిగిపోతున్న కెనడా కలలు

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి అమెరికాలోని చికాగోలో దాడికి గురైన సంగతి తెలిసిందే. ఈ నెల ఆరంభంలో లంగర్‌హౌజ్‌ హషీమ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ మజాహిర్‌ అలీపై దుంగడులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో.. తనపై జరిగిన దాడిని అలీ వీడియో ద్వారా వెల్లడించారు. అతడికి అవసరమైన సాయం అందిస్తామని చికాగోలోని భారత ఎంబసీ హామీ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని