Odisha Train Accident: ఏఐ సాంకేతికతతో మృతదేహాల గుర్తింపు!

ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 83 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. వారిని గుర్తించేందుకు రైల్వే అధికారులు ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

Published : 08 Jun 2023 01:51 IST

దిల్లీ: ఒడిశా రైలు ప్రమాద (Odisha Train Accident) ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. దీంతో కృత్రిమ మేధ (AI) ఆధారిత వెబ్‌సైట్‌తోపాటు సిమ్‌కార్డు ట్రైయాంగులేషన్‌ విధానంలో వారిని గుర్తించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరిని గుర్తించినట్లు తెలిపారు. 

బాలేశ్వర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 83 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. వారిని గుర్తించేందుకు రైల్వే అధికారులు తొలుత ఆధార్‌ (UIDAI) నిపుణులను రప్పించి మృతదేహాల నుంచి వేలి ముద్రలు తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, మృతదేహాలు అందుకు అనుకూలంగా లేకపోవడంతో వేలి ముద్రలు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో మొబైల్‌ సిగ్నళ్ల సహాయంతో పనిచేసే సంచార్‌ సాథీ (Sanchar Saaathi)ని ఇందుకు వినియోగించారు.

కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేసే ఈ సాంకేతికతతో 65 మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నించగా అందులో 45 కేసుల్లో మాత్రమే విజయవంతమైనట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా రైలు ప్రమాదంలో మరణించిన వారు సిమ్‌కార్డు కొనుగోలు చేసే సమయంలో సమర్పించిన ఆధార్‌ వివరాలతో బాధితులను గుర్తించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను సంప్రదించి, మృతదేహాలను అప్పగించారు. ఈ క్రమంలోనూ కొన్ని మృతదేహాలు గుర్తించేందుకు  అనువుగా లేకపోవడంతో  ఈ ప్రక్రియ మరింత కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.

దీంతో మొబైల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రమాదానికి కొంత సమయం ముందు ఏయే నంబర్లు యాక్టివ్‌గా ఉండి, ప్రమాదం జరిగిన వెంటనే కట్‌ అయ్యాయనే విషయాన్ని సెల్‌ఫోన్‌ టవర్ల సిగ్నల్స్‌ ద్వారా విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో 45 మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నించారు. అయితే, సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా గుర్తించిన వాటిలో 15మంది ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ అధికారులకు సవాలుగా మారింది.  పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్‌ ఫోన్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ‘సంచార్‌ సాథీ’ అనే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. తొలివిడతలో దీనిని సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (CEIR) పేరుతో అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న వాళ్లు ఈ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం వల్ల సదరు ఫోన్‌ను బ్లాక్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పడు ఈ సాంకేతికతనే రైలు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని