Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం.. ఇప్పటికీ మార్చురీలోనే 52 మృతదేహాలు!

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇప్పటికీ కొందరి మృతదేహాలు భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో ఉన్నాయని బీఎంసీ మేయర్‌ తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా వారిని గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తున్నట్లు చెప్పారు. 

Published : 30 Jun 2023 21:14 IST

భువనేశ్వర్‌: ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Tragedy) ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఘటన జరిగి నెలరోజులు పూర్తి కావస్తున్నా.. ఇప్పటికీ ప్రమాదంలో మృతిచెందిన వారి గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా 52 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ (BMC) మేయర్‌ సులోచనా దాస్‌ తెలిపారు. ఈ మృతదేహాలను భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో భద్రపరిచినట్లు వెల్లడించారు. ‘‘బాలాసోర్‌ రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇంకా 81 మంది మృతదేహాలు భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో ఉన్నాయి. వాటి నుంచి నమూనాలను సేకరించి డీఎన్‌ఏ పరీక్షలకు పంపించాం. వాటిలో 29 మృతదేహాలను గుర్తించాం. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించాం. ఇంకా 52 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. గుర్తించిన వాటిలో ఐదు మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాం’’ అని సుచోచనా దాస్‌ తెలిపారు. 

గతంలో ఒకే మృతదేహాన్ని తమ వారిదేనని వేర్వేరు వ్యక్తులు చెప్పిన ఘటనలు చోటుచేసుకున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మేయర్ చెప్పారు. ఒడిశా ప్రభుత్వ ఆదేశాల మేరకు మృతదేహాలను తీసుకెళ్లేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకవేళ కుటుంబ సభ్యులు మృతదేహాలను తమ స్వస్థలాలకు తీసుకెళ్లకూడదని భావిస్తే.. వారు భువనేశ్వర్‌లోనే అంతక్రియలు నిర్వహించుకునేందుకు బీఎంసీ ఏర్పాట్లు చేసింది. జులై 2న ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో 291 మంది మృతి చెందగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని