Parliament: సమాధానం కోరితే.. సస్పెన్షనా..? కేంద్రం తీరును ఖండించిన విపక్షాలు

Parliament: ఒకేసారి భారీ సంఖ్యలో విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 

Updated : 19 Dec 2023 15:44 IST

దిల్లీ: గతవారం పార్లమెంట్‌(Parliament)లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై కేంద్రహోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు నిరసనలు కొనసాగించడంతో.. భారీ సంఖ్యలో విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటుపడింది. తాజాగా ఆ సంఖ్య 140కు చేరింది. ఈ చర్యను విపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సభల్లో అర్థవంతమైన చర్చలేకుండా చట్టాలు ఆమోదించుకునేందుకే ఈ సస్పెన్షన్‌ అని మంగళవారం కాంగ్రెస్(Congress) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఎన్‌సీపీ అధినేత, రాజ్యసభ ఎంపీ శరద్ పవార్(Sharad Pawar) ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు లేఖ రాశారు. (Security breach in LS)

లోక్‌సభలో మరో 49 మందిపై సస్పెన్షన్‌ వేటు..

  • సభల్లో అర్థవంతమైన చర్చలేకుండా చట్టాలు ఆమోదించుకునేందుకు కేంద్రప్రభుత్వం విపక్షం మొత్తాన్ని ఖాళీ చేయించింది. దీంతో ఇద్దరు దుండగులు ప్రవేశించేందుకు పాస్‌లు ఇచ్చిన ఎంపీ నిర్దోషిగా మారారు.. కాంగ్రెస్
  • భద్రతా ఉల్లంఘన అంశాన్ని చర్చించకపోవడం బాధాకరం. ఎంపీలను కాపాడడానికి బదులుగా వాళ్లను సస్పెండ్‌ చేస్తున్నారు.. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
  • భద్రతా వైఫల్యం ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన సభ్యలపై సస్పెన్షన్ వేటు విధించడం.. పారదర్శకత, జవాబుదారీ సూత్రాలకు విరుద్ధం. పార్లమెంట్‌ భద్రతకు సంబంధించి వివరణ కోరే హక్కు సభ్యులకు ఉంటుంది. జరిగిన ఘటన ఎంత తీవ్రమైందో సభ్యుల నిరసనలు వెల్లడిచేస్తున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతుందో ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలియజేయాలి. కానీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది.. శరద్‌ పవార్
  •  ప్రజాస్వామ్యమే సస్పెన్షన్‌కు గురైంది- ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా
  • భద్రతా ఉల్లంఘన ఘటనపై మేం ప్రభుత్వం  నుంచి సమాధానం కోరుతున్నాం. ఈ చర్చ భాజపా ఎంపీలతో పాటు అందరి భద్రతకు సంబంధించిన అంశం.  కానీ ప్రభుత్వం చర్చ నుంచి పారిపోతోంది - ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే
  • నా 15 ఏళ్ల పార్లమెంట్ కెరీర్‌లో.. భద్రతా వైఫల్యంపై చర్చించాలని మొదటిసారి వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించాను. ఆ ఘటనపై వివరణ కోరిన సస్పెండ్‌ అయిన కాంగ్రెస్‌ మిత్రులకు సంఘీభావంగా నేనలా చేశాను..కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
  • ఈ సస్పెన్షన్లు చూస్తుంటే నాకు నోట మాట రావడం లేదు. ఈ కొత్త పార్లమెంట్ నిర్మాణానికి ముందు వారు అసలు ఏం ఆలోచించారు..? మీరు విపక్షం మొత్తాన్ని బయటకు తోశారు. కానీ పాస్‌లు జారీ చేసిన ఎంపీపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొత్త పార్లమెంట్‌లో కొత్త నిబంధనలు.. శిరోమణి అకాలీదళ్‌(బాదల్‌) ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌
  • ఇక్కడ సస్పెండ్ అయ్యేది ఎంపీలు కాదు ప్రజాస్వామ్యం.. కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ

ఇప్పటివరకు లోక్‌సభలో 95 మందిని సస్పెండ్‌ చేయగా.. రాజ్యసభలో 46 మందిని సస్పెండ్ చేశారు. మొత్తంగా సస్పెండ్ అయిన సభ్యుల సంఖ్య 140 దాటింది. ఈ చర్య రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని