Corona: 400 మంది పార్లమెంటు సిబ్బందికి కరోనా.. మరికొన్ని రోజుల్లో బడ్జెట్‌ సమావేశాలు!

మరికొన్ని రోజుల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో పార్లమెంటు సిబ్బందిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి....

Updated : 09 Jan 2022 14:45 IST

దిల్లీ: మరికొన్ని రోజుల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో పార్లమెంటు సిబ్బందిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాయి.

పార్లమెంటులో మొత్తం 1,409 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 400 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వేరియంట్‌ నిర్ధారణ కోసం వీరి నమూనాల్ని జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపినట్లు వెల్లడించారు. జనవరి 4-8 మధ్య జరిపిన నిర్ధారణ పరీక్షల్లో ఈ కేసులు వెలుగు చూసినట్లు సమాచారం.

కరోనా బారినపడ్డ ప్రతిఒక్కరూ ప్రభుత్వ నిబంధనల్ని పాటించాలని అంతర్గతంగా సిబ్బందికి సందేశం పంపినట్లు తెలుస్తోంది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో 200 మంది లోక్‌సభ సిబ్బంది, 69 మంది రాజ్యసభ, 133 మంది అనుబంధ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. దీంతో వీరితో కాంటాక్ట్‌లోకి వచ్చిన పలువురు ఉన్నతస్థాయి అధికారులు కూడా ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇటీవల కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాలని.. మిగిలిన వారు ఇంటి నుంచి సేవలందించాలని ఆదేశించింది. ఒమిక్రాన్‌ ముప్పును దృష్టిలో ఉంచుకొని బయోమెట్రిక్‌ నుంచి కూడా ప్రభుత్వం ఉద్యోగులకు మినహాయింపునిచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని