డ్రోన్లు, నాటో వ్యూహాలు.. భారత్‌కు డేంజర్‌ బెల్స్‌..!

టర్కీ ల్యాండ్‌ఫోర్స్‌ కమాండర్‌ ఉమిత్‌ దున్‌దార్‌ పాక్‌ పర్యాటనకు వచ్చారు. ఇదేదో సాధారణ పర్యటన కాదు. ఈ పర్యటనలో ఆయనకు నిషాన్‌-ఇ-ఇంతియాజ్‌ అవార్డను పాక్‌ ప్రకటించింది. దీని వెనుక డ్రోన్‌ టెక్నాలజీ కోసం పాక్‌ వెంపర్లాట కనిపిస్తుంది..

Updated : 09 Jul 2021 14:47 IST

 సాంకేతికత కోసం పాక్‌ ఆరాటం 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

టర్కీ ల్యాండ్‌ఫోర్స్‌ కమాండర్‌ ఉమిత్‌ దున్‌దార్‌ పాక్‌ పర్యటనకు వచ్చారు. ఇదేదో సాధారణ పర్యటన కాదు. ఈ పర్యటనలో ఆయనకు నిషాన్‌-ఇ-ఇంతియాజ్‌ అవార్డును పాక్‌ ప్రకటించింది. దీని వెనుక డ్రోన్‌ టెక్నాలజీ కోసం పాక్‌ వెంపర్లాట కనిపిస్తుంది.. ఈ టెక్నాలజీని సాధించేందుకు టర్కీని దువ్వుతోంది. పాక్‌తో అంటకాగటానికి టర్కీకి ‘అణు’ అవసరాలు ఉన్నాయి. ఇక పాక్‌ చేతికి టర్కీ డ్రోన్‌ టెక్నాలజీ, నాటో సైనిక కూటమి వ్యూహాలు వస్తే భారత్‌కు నిస్సందేహంగా ప్రమాదమే.

ప్రస్తుత టర్కీ బేర్తర్‌ టీబీ2 డ్రోన్లు అత్యంత ప్రమాదకరం. దీనికి తోడు ఆ దేశం వద్ద నాటో దళాలు అనుసరించే  ‘హైటెక్‌ రోబోటిక్ వార్ఫేర్‌ డాక్టరీన్‌ ’(రోబోటిక్‌ యుద్ధతంత్ర వ్యూహాలు) ఉన్నాయి. వీటిని అమెరికా నేతృత్వంలోని సేనలు అఫ్గాన్‌ యుద్ధంలో వాడాయి. ఆ సేనల్లో టర్కీ కూడా ఒక భాగం. గతేడాది టర్కీ వీటిని మొత్తం నాగర్నో కారాబాకు యుద్ధానికి ముందు అజర్‌బైజన్‌కు ఇచ్చింది. అంతేకాదు, సిరియాలోని టర్కీ కిరాయి మూకలకు కూడా సహాయంగా పంపింది. తాజాగా పాక్‌ కూడా అటువంటి సాయాన్నే కోరుకుంటోంది. 

ఎలాంటి వ్యూహాలు అవి..

అఫ్గాన్‌ మారుమూల ప్రాంతాలు, పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దులకు అమెరికా ఇన్‌ఫాంట్రి, మెరైన్‌,నేవీ సీల్‌, సీఐఏ పారామిలటరీ ఫోర్సులతో కూడిన చిన్నచిన్న బృందాలను తొలుత పంపించింది.  వీరు అఫ్గాన్‌ నేషనల్‌ ఆర్మీతో కలిసిపోయి పనిచేశారు. అమెరికా బృందాలు సోఫ్లామ్‌ (స్పెషల్‌ ఆపరేషన్‌ ఫోర్సెస్‌ లేజర్‌ అక్విజేషన్‌ మార్కర్‌) అనే ప్రత్యేకమైన పరికరాన్ని వాడాయి. దీంతో కొండలపై ఉన్న తాలిబాన్ల స్థావరాలను గుర్తించి  లేజర్‌ సాయంతో ప్రత్యేకంగా మార్కింగ్‌ చేశాయి. అంటే లక్ష్యాలను గుర్తించడం అన్నమాట. ఆ తర్వాత సంకీర్ణ దళాల విమానాలు, డ్రోన్లు రంగంలోకి దిగి ఆ లేజర్‌ మార్కింగ్‌ను తమ గైడెడ్‌ జేడీఎఎం బాంబులకు లాక్‌ చేసి ప్రయోగించేవి. అవి కచ్చితంగా లక్ష్యాలను తాకేవి. ఇదే తరహాలో అజర్‌ బైజన్‌ కమాండో బృందాలు అర్మేనియాలోకి చొరబడి తమ రాకెట్‌ లాంఛర్లకు లక్ష్యాలను నిర్దేశించాయి.  అజర్‌ బైజన్‌, దాని మద్దతు దళాలకు టర్కీ మిలటరీ అకాడమీ,పాకిస్థాన్‌లో నాటో తరహా శిక్షణ లభించినట్లు ‘రేడియో ఫ్రీ యూరప్‌’ పేర్కొంది.  అంతేకాదు టర్కీ దళాలకు అఫ్గాన్‌లో పనిచేసిన అనుభవంతో నాటో వ్యూహాలను వంటబట్టించుకొంది. 

ముందుగానే డ్రోన్లతో సాధన.. 

అజర్‌ బైజన్‌ యుద్ధానికి సిద్ధమవ్వడంలో భాగంగా టర్కీ దళాలతో గతేడాది వేసవిలో సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ క్రమంలో డ్రోన్లను ఎలా వాడాలి.. ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలన్న విషయాన్నిక్షుణ్ణంగా నేర్చుకొంది. ఉక్రెయిన్‌ నుంచి రెండో ప్రపంచ యుద్ధం నాటి ఏఎన్‌-2ఎస్‌ విమానాలు కొనుగోలు చేసింది. వీటిని రిమోట్‌ విమానాలుగా మార్చింది. అర్మేనియా ఎయిర్‌ డిఫెన్స్‌లు ఎక్కడ ఉన్నాయో గుర్తించేందుకు వీటిని ఎరగా వేసింది. ఆ తర్వాత ఎయిర్‌ డిఫెన్స్‌లపై  డ్రోన్లతో దాడి చేసి ధ్వంసం చేసింది. 

దీనిలో భారత్‌కు ముప్పు ఏమిటీ..? 

టర్కీ కొన్నేళ్లుగా అణ్వాయుధ టెక్నాలజీని సంపాదించాలని ప్రయత్నాలు చేస్తోంది. పాక్‌ వద్ద ఆ టెక్నాలజీ ఉంది. పాకిస్థాన్‌కు డ్రోన్ల అవసరం చాలా ఉంది. పరస్పరం అవసరాలు ఉండటంతో సాంకేతికత బదలాయించుకొనే ప్రమాదం ఉంది. ఇరు దేశాలు కశ్మీర్‌ విషయంలో ఒకే వాదన వినిపిస్తున్నాయి. కశ్మీర్‌ నుంచి వెళ్లేవారు ఐఎస్‌ఐతో భేటీ అయ్యేందుకు టర్కీ ఒక వేదిక వలే వ్యవహరిస్తోంది. ఇక ఇటీవల పరిణామాలు చూస్తే.. డ్రోన్ల కోసం పాక్‌ ఎంత వేగంగా ప్రయత్నిస్తోందో అర్థం అవుతుంది. భారత్‌ వైమానిక స్థావరంపై డ్రోన్‌ దాడి జరగడంతో మన రక్షణ వ్యవస్థల్లో కొన్ని లోపాలపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో పాక్‌ నిఘా డ్రోన్లు, సాయుధ డ్రోన్లతో సాధన చేయడం మొదలుపెట్టినట్లు ‘ది స్టేట్స్‌మన్‌’ కథనం పేర్కొంటోంది. భారత్‌ 10 యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు కొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినా.. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాదిన్నర పడుతుంది. టర్కీ వద్ద మానవ రహిత విమానాల కొనుగోలుకు పాక్‌ అధికారుల పర్యటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టర్కీ పదాతి దళాల జనరల్‌ పాక్‌ పర్యటనకు వచ్చారు. రక్షణ రంగానికి చెందిన పలు అంశాలపై చర్చించారు. ఆయన సేవలకు నిషాన్‌-ఇ-ఇంతియాజ్‌ అవార్డును ప్రకటించింది. గతేడాది పాక్‌ జనరల్‌ నదీమ్‌ రజాకు ది లిజియన్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డును టర్కీ ప్రకటించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని