Pegasus Spyware: ‘పెగాసస్‌’తో మాపై భారత్‌ గూఢచర్యం.. పాక్‌ ఆరోపణ

భారత్‌పై పాకిస్థాన్ మరోసారి నోరు పారేసుకుంది. భారత్‌లో పెగాసస్ వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సహా....

Published : 23 Jul 2021 21:10 IST

దిల్లీ: భారత్‌పై పాకిస్థాన్ మరోసారి నోరు పారేసుకుంది. భారత్‌లో పెగాసస్ వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది. పెగాసస్ స్పైవేర్‌ను తమపై భారత్‌ ప్రయోగించిందని, పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సహా విదేశీయులపై భారత ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నామని ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఐక్యరాజ్య సమితిని కోరినట్లు పేర్కొంది.

అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘిస్తూ భారత్ తన ప్రయోజనాల కోసం విస్తృతమైన గూఢచర్యానికి పాల్పడుతోందని పాక్ ఆరోపించింది. పెగాసస్ పర్యావసనాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపిన పాక్ విదేశాంగ శాఖ.. భారత్ చర్యలను అంతర్జాతీయ సమాజం ముందుకు తీసుకొస్తామని పేర్కొంది. వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరముందని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

పెగాసస్‌ వ్యవహారం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు కాంగ్రెస్‌ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సహా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ స్పైవేర్‌ వ్యవహారం పార్లమెంట్‌ను సైతం కుదిపేస్తోంది. ఈ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో శుక్రవారం కూడా ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనలతో 15 నిమిషాలకే లోక్‌సభ వాయిదా పడింది. పెగాసెస్‌ స్పైవేర్‌ వ్యవహారం భారత్‌ సహా పలు దేశాలను కుదిపేస్తున్న వేళ ఇజ్రాయెల్‌ ప్రభుత్వం స్పందించింది. ఆ దేశానికి చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ ఈ స్పైవేర్‌ విక్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇజ్రాయెల్‌ మంత్రుల బృందం ఒకటి దర్యాప్తు జరపనుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని