COVID 19: ‘మహమ్మారి ఇంకా ముగియలేదు..!’ 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

రోజువారీ కొవిడ్‌ కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతోన్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ.. ఎనిమిది రాష్ట్రాలకు లేఖ రాసింది. ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హరియాణా, దిల్లీలు ఇందులో ఉన్నాయి.

Published : 21 Apr 2023 18:55 IST

దిల్లీ: ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతోన్న కొవిడ్‌ వైరస్‌ (Coronavirus) కారణంగా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో మరోసారి కేసుల పెరుగుదల నమోదైన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల సంఖ్య 11 వేలు దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్య 66 వేలకు చేరుకుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు (Covid Cases), పాజిటివిటీ రేటు (Positivity Rate) పెరుగుతోన్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఎనిమిది రాష్ట్రాలకు లేఖ రాసింది. ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హరియాణా, దిల్లీ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 63 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 దాటింది.

‘మహమ్మారి ఇంకా ముగియలేదు. వైరస్‌ కట్టడి విషయంలో అలసత్వం వహించకుండా.. అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కొవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరికలు, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. అధిక సంఖ్యలో కేసుల నమోదు స్థానికంగా వైరస్‌ వ్యాప్తిని సూచిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో.. ప్రారంభ దశలోనే దీన్ని నియంత్రించేందుకు అవసరమైన ప్రజారోగ్య చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కొవిడ్ వ్యాప్తిపై పర్యవేక్షణను పెంచాలని, ఇన్‌ఫ్లుయెంజా, శ్వాసకోస ఇన్ఫెక్షన్ల కేసులపైనా దృష్టి సారించాలని తెలిపారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపే నమూనాల సంఖ్యనూ పెంచాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని