Central Vista: దిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాలు

పార్లమెంట్‌ నూతన భవన సమూదాయం సెంట్రల్‌ విస్టా నిర్మాణ పనులపై స్టే విధించలేమని దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ విస్టా నిర్మాణం కొనసాగించడమేంటని, వెంటనే నిర్మాణ పనులు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డాక్యుమెంటరీ

Published : 02 Jun 2021 23:46 IST

దిల్లీ: పార్లమెంట్‌ నూతన భవన సమూదాయం సెంట్రల్‌ విస్టా నిర్మాణ పనులపై స్టే విధించలేమని దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ విస్టా నిర్మాణం కొనసాగించడమేంటని, వెంటనే నిర్మాణ పనులు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇటీవల డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌, చరిత్రకారుడు సోహైల్‌ హష్మీ, ట్రాన్సలేటర్‌ అన్యా మల్హోత్రా దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై రెండ్రోజుల కిందట దిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు అత్యవసరమైందేనని, నిర్మాణ పనులు కొనసాగించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు చట్టబద్ధతను ఇప్పటికే సుప్రీంకోర్టు సమర్థించిందని, నిర్మాణ పనులకు దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా అనుమతించిందని న్యాయస్థానం గుర్తుచేసింది. ఇప్పటికే కూలీలు పనులు మొదలుపెట్టారని తెలిపింది. అందువల్ల నిర్మాణ పనులు ఆపేందుకు ఎలాంటి కారణాలూ లేవని, ఇది ఉపయోగకరమైన ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. పిటిషనర్లకు రూ.లక్ష చొప్పున కోర్టు జరిమానా విధించింది.

అయితే, దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ న్యాయవాది ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సెంట్రల్‌ విస్టా నిర్మాణ పనులు ఆపాలని వేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు న్యాయం చేయలేదన్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ సెంట్రల్‌ విస్టా నిర్మాణంలో పనిచేసే కార్మికులకు కరోనా సోకే ప్రమాదం ఉందనే విషయాన్ని హైకోర్టు గుర్తించలేదని ప్రదీప్‌ కుమార్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ నిర్వహణ పూర్తిగా నిలిచిపోయిన సమయంలో సెంట్రల్‌ విస్టా నిర్మాణం మాత్రం ముఖ్యమైన ప్రాజెక్టు అని హైకోర్టు వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. సెంట్రల్‌ విస్టా నిర్మాణ పనులపై స్టే విధించాలని దిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లకు ప్రదీప్‌ కుమార్‌కు ఎలాంటి సంబంధం లేకపోవడం గమనార్హం. దిల్లీ హైకోర్టు తీర్పును మాత్రమే సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని