Modi: నీతీశ్‌జీ.. ఇంకా ఎంతగా దిగజారుతారు: ‘జనాభా నియంత్రణ’ వ్యాఖ్యలపై మోదీ ఆగ్రహం

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్(Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఆగడం లేదు. తాజాగా ప్రధాని మోదీ(Modi) కూడా ఈ మాటలను ఖండించారు. 

Published : 08 Nov 2023 15:57 IST

దిల్లీ: జనాభా నియంత్రణ (population control) విషయంలో మహిళల విద్యకున్న ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌(Bihar Chief Minister Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వీటిని ఉద్దేశిస్తూ..ప్రధాని మోదీ(PM Modi) తీవ్రంగా స్పందించారు. ఇంకా ఎంతగా దిగజారిపోతారంటూ నీతీశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని గుణలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విధంగా మాట్లాడారు.

‘ప్రతిపక్షాల అహంకార కూటమిలో పెద్దనేత అయిన ఆయన.. నిన్న అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించారు. ఇలాంటి మాటలు వాడటం పట్ల వారికి సిగ్గుగా అనిపించడం లేదా..? ఆ కూటమిలోని ఏ ఒక్కనేత కూడా నీతీశ్‌ మాటలను ఖండించలేదు. మహిళల గురించి ఈ రకమైన ఆలోచన ఉన్నవారు మీకు ఏదైనా మంచి చేయగలరా..? మన తల్లులు, సోదరీమణుల పట్ల ఇలాంటి దురుద్దేశంతో దేశాన్ని అవమానిస్తున్నారు. మీరు ఇంకా ఎంతగా దిగజారిపోతారు..?’ అంటూ నీతీశ్‌ (Nitish Kumar) వ్యాఖ్యలను ఆక్షేపించారు.

జనాభా నియంత్రణ వ్యాఖ్యలపై దుమారం.. క్షమాపణలు చెప్పిన నీతీశ్‌ కుమార్

ఇటీవల బిహార్‌(Bihar)లో నిర్వహించిన కులగణనకు సంబంధించిన నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా  నితీశ్‌ మాట్లాడుతూ.. చదువుకున్న మహిళలు తమ భర్తలను నియంత్రించగలరని వ్యాఖ్యానించారు. ‘‘భర్తల చర్యల వల్ల జననాలు పెరిగాయి. అయితే చదువుకున్న మహిళకు భర్తను ఎలా నియంత్రించాలో తెలుసు. అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతూ వస్తోంది’’ అని మాట్లాడారు. ఈ మాటలపై దుమారం రేగడంతో నీతీశ్‌ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ‘నా మాటలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తే.. వాటిని ఉపసంహరించుకుంటా’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని