PM Modi: మోదీని ఆకట్ట్టుకొన్న జపాన్‌ రాయబారి ట్వీట్‌..!

జపాన్‌ రాయబారి హిరోషి దంపతులు భారత ఆహార వైవిధ్యాన్ని ఆస్వాదించడం ప్రధాని మోదీని ఆకర్షించింది. తాజాగా ప్రధాని ఆ దంపతుల వీడియోను రీట్వీట్‌ చేసి.. సరదా వ్యాఖ్యలు జోడించారు. 

Published : 11 Jun 2023 18:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లోని జపాన్‌ రాయబారి హిరోషి సుజుకి దంపతులు దేశీయ రుచులను ఆస్వాదిస్తున్న తీరు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆకర్షించింది. ప్రధాని నియోజకవర్గమైన వారణాసిలో గత నెల హిరోషి దంపతులు బనారసీ చాట్‌, తాలి ఆరగించిన చిత్రాలను ట్విటర్‌లో పంచుకొన్నారు. ఈ సారి హిరోషి దంపతులు ముంబయిలో వడాపావ్‌ను రుచి చూశారు. తాజాగా ఆ దంపతులు స్ట్రీట్‌ఫుడ్‌ అన్వేషణలో భాగంగా కొల్హాపురి వంటకాలను తిన్నారు. ఇవి కొంచె కారం ఎక్కువగానే ఉంటాయి. కానీ, హిరోషి సతీమణి ఇవేవీ పట్టించుకోకుండా ఆ రుచులను ఆస్వాదించారు. 

ఈ వీడియోను హిరోషి తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘‘నా భార్య నన్ను ఓడించింది’’ అని ఆయన క్యాప్షన్‌ పెట్టారు. దీనిలో ఆయన పుణేలో కొల్హాపురి రుచులను వారు రుచిచూస్తున్నారు. హిరోషి కొంచె తక్కువ కారం కోరుకుంటే.. ఆయన సతీమణి మాత్రం కొల్హాపురి రేంజిలో స్పైసీగా ఉండాలని డిమాండ్‌ చేశారు. వారు మిసల్‌పావ్‌, సబుదాన (సగ్గుబియ్యం)వడలను రుచి చూశారు. వారు కయానీ బేకరీ, ఇరానీ కేఫ్‌ వంటి ప్రముఖ ఆహారశాలలను సందర్శించారు. 

ఈ ట్వీట్‌ ప్రధాని మోదీని ఆకర్షించింది. దీనిని ఆయన రీట్వీట్‌ చేస్తూ..‘‘మిస్టర్‌ అంబాసిడర్‌. మీరు ఓడిపోయినా పట్టించుకోని పోటీ ఇది. మీరు భారత్‌లోని ఆహార వైవిధ్యాన్ని ఆస్వాదించడం.. దానిని వినూత్నంగా ప్రజెంట్‌ చేయడం చూడటానికి చాలా బాగుంది. వీడియోస్‌ను కొనసాగించండి’’ అని పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని