Rahul Gandhi: రాహుల్ నైట్ క్లబ్‌కు వెళ్లడంపై విమర్శలు.. కాంగ్రెస్ కౌంటర్

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేపాల్‌ పర్యటనలో ఓ నైట్‌ క్లబ్‌కు వెళ్లడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై భాజపా, కాంగ్రెస్‌ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది......

Published : 04 May 2022 02:09 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేపాల్‌ పర్యటనలో ఓ నైట్‌ క్లబ్‌కు వెళ్లడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై భాజపా, కాంగ్రెస్‌ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా చెప్పుకొనే నాయకుడు నైట్‌క్లబ్‌ల్లో తిరగడమేంటంటూ సామాజిక మాధ్యమాల్లో భాజపా విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా.. వ్యక్తిగత పర్యటనలపై విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్‌ అంటోంది. రాహుల్ వీడియో భాజపా పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే కేంద్ర మాజీ మంత్రి, భాజపా రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్‌ జావడేకర్‌ ఓ పార్టీలో పాల్గొన్న ఫొటోతో కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఓ పార్టీలో జావడేకర్‌ షాంపైన్‌ బాటిల్‌ పట్టుకొని వేడుకల్లో ఉన్న ఫొటోను కాంగ్రెస్‌ నేత బీవీ శ్రీనివాస్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘ఎవరో గుర్తుపట్టండి?’ అని క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. 

కాంగ్రెస్‌ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రాహుల్‌ విదేశాల్లో నైట్‌క్లబ్‌ల్లో పార్టీ చేసుకుంటున్నారంటూ భాజపా ఐటీ కన్వీనర్‌ అమిత్‌ మాలవీయ ట్విట్‌ చేయగా.. మిత్రదేశంలో ఫ్రెండ్‌ పెళ్లికి వెళ్లడం ఏమీ నేరం కాదని కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇచ్చింది.  ‘‘ప్రధాని మోదీ మాదిరిగా రాహుల్‌ గాంధీ ఏం పాకిస్థాన్‌లోని పిలవని వేడుకకు వెళ్లి నవాజ్‌ షరీఫ్‌తో కేక్‌ కట్‌ చేయలేదు కదా. జర్నలిస్టు ఫ్రెండ్‌ వివాహానికి హాజరయ్యేందుకు మిత్ర దేశమైన నేపాల్‌ వెళ్లారు. ఇందులో తప్పేం లేదు. ఇదేం నేరం కాదు. బహుశా.. స్నేహితులు, కుటుంబసభ్యుల పెళ్లిళ్లకు వెళ్లడాన్ని కూడా నేరంగా భావిస్తూ భాజపా త్వరలోనే నిర్ణయం తీసుకుంటుదేమో’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా దుయ్యబట్టారు.

మరోవైపు, రాహుల్ తీరుపై నఖ్వీ విమర్శలు గుప్పించారు. ‘‘రాహుల్ గాంధీ పూర్తిస్థాయి పర్యాటకులు. అప్పుడప్పుడూ కపట రాజకీయాలు చేస్తుంటారు. పర్యటన పూర్తయి సమయం దొరికినప్పుడు తప్పుడు కల్పిత కథనలు ప్రచారం చేస్తుంటారు. నిరాధార వ్యాఖ్యలు చేస్తూ దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. ఆయన చేసే వ్యాఖ్యలు సొంత పార్టీని తప్పుదోవపట్టిస్తాయి కానీ.. దేశ ప్రజల్ని కాదు’’ అంటూ విమర్శించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని