Droupadi Murmu: అందుకే భారత్‌ ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా ఎదిగింది: రాష్ట్రపతి

ఒకప్పుడు పేద, నిరక్షరాస్య దేశంగా ఉన్న భారత్‌, రాజ్యాంగ నిర్మాతల ముందుచూపుతో ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరిస్తోందని ముర్ము అన్నారు. 

Published : 25 Jan 2023 23:54 IST

దిల్లీ: భారత దేశంలో అనేక జాతులు, అనేక భాషలు ఉన్నప్పటికీ, అవి దేశ ప్రజల్ని విడదీయలేదని.. ఏకం చేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అన్నారు. అందుకే  భారత్‌ ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా విజయం సాధించిందని చెప్పారు. 74వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఒకప్పుడు పేద, నిరక్షరాస్య దేశంగా ఉన్న భారత్‌, రాజ్యాంగ నిర్మాతల ముందుచూపుతో ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరిస్తోందని ముర్ము అన్నారు. 

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. కరోనా మహమ్మారి వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపినప్పటికీ.. సమర్థ నాయకత్వం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ప్రస్థానాన్ని కొనసాగించిందని తెలిపారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో భారత్‌ ఎంతో అభివృద్ధి చెందిదని, ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ముందంజలో ఉన్న కొద్ది దేశాల్లో భారత్‌ కూడా ఒకటని రాష్ట్రపతి అన్నారు.  మహిళా సాధికారత, స్త్రీ, పురుష సమానత్వాలను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో దేశం  గొప్ప ప్రగతి సాధించిందని చెప్పారు. 

జీ20కి నాయకత్వం వహించడం భారత్‌కు లభించిన ఓ గొప్ప అవకాశంగా రాష్ట్రపతి అభివర్ణించారు. ప్రపంచ జీడీపీలో 85 శాతం జీ20 దేశాల్లో ఉందని, ప్రపంచం ఎదుర్కొంటున్న గ్లోబల్‌ వార్మింగ్‌ వంటి సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు ఇది సరైన వేదికని చెప్పారు. రైతులు, కార్మికులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు దేశానికి గొప్ప బలమని..  వీరందరి సమిష్టి కృషి దేశాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. దేశ భ్రదత కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ.. దేశం కోసం త్యాగాలు చేస్తున్న సైనికుల సేవలను రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రశంసించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని