CBI: దర్యాప్తు సంస్థలు పంజరంలో చిలుకలు కాదు: అబ్బాస్‌ నఖ్వీ

దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలు పంజరంలో చిలుకలు కాదని, అవి చట్టానికి ఆభరణాలని భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. ఎలాంటి భయాలకు తలవంచకుండా వాటి పని అవి చేసుకుపోతున్నాయని చెప్పారు. దర్యాప్తు సంస్థలను అధికార భాజపా అనుకూలంగా...

Published : 24 Sep 2022 02:16 IST

రామ్‌పూర్‌‌: దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలు పంజరంలో చిలుకలు కాదని, అవి చట్టానికి ఆభరణాలని భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. ఎలాంటి భయాలకు తలవంచకుండా వాటి పని అవి చేసుకుపోతున్నాయని చెప్పారు. దర్యాప్తు సంస్థలను అధికార భాజపా అనుకూలంగా మలుచుకుంటోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ తప్పులు చేసేవారే ఇలాంటి దర్యాప్తు సంస్థలను కించపరుస్తున్నారు. అవినీతి ఛాంపియన్లందరూ ఇవాళ  భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అందుకే వారంతా దర్యాప్తు సంస్థలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.’’ అని నఖ్వీ అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మదర్సాలు, వక్ఫ్‌ ఆస్తులను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. వచ్చిన విమర్శలపైనా నఖ్వీ స్పందించారు. ప్రతిపక్షాలు ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నాయని, ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఎవరూ విఘాతం కలిగించలేరని అన్నారు. ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’ లాంటి ఇస్లామిక్‌ సంస్థలు దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. ఇలాంటి దుష్ట శక్తులను ఓడించేందుకు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. ‘మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారే మానవాళికి అతిపెద్ద శత్రువులు’ అని నఖ్వీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని