Ratan Tata: రతన్‌ టాటా పేరుతో ‘మద్యం’పై ఫేక్‌న్యూస్‌

సోషల్‌మీడియాలో నకిలీ వార్తల ప్రవాహం నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రముఖుల పేర్లతో తప్పుడు వార్తలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి.

Published : 03 Sep 2021 17:56 IST

క్లారిటీ ఇచ్చిన పారిశ్రామికవేత్త

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌మీడియాలో నకిలీ వార్తల ప్రవాహం నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రముఖుల పేర్లతో తప్పుడు వార్తలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా పేరుతోనూ అలాంటి ఓ ఫేక్‌న్యూస్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. మద్యం అమ్మకాలకు ఆధార్‌ను లింక్‌ చేయాలని టాటా చెప్పినట్లు ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ వార్తలపై ఆయన స్పందించారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. 

‘‘మద్యం విక్రయాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలి. మద్యం కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం ఇచ్చే ఆహార సబ్సిడీలను నిలిపివేయాలి. ఆల్కహాల్‌ కొనే స్తోమత ఉన్నవారు కచ్చితంగా ఆహారాన్ని కొనుగోలు చేసుకోగలరు. మనం వాళ్లకు ఉచితంగా ఆహారపదార్థాలు అందిస్తుంటే వారు మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు’’ అని రతన్‌ టాటా చెప్పినట్లుగా ఉన్న ఒక మెసేజ్‌ను ఇటీవల సోషల్‌మీడియాలో ఎక్కువగా షేర్‌ చేస్తున్నారు. దీంతో ఈ మెసేజ్‌ను టాటా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘‘ఇది నేను చెప్పలేదు’’ అని రాసుకొచ్చారు. దీనికి ఫేక్‌ న్యూస్‌ అనే జిఫ్‌ ఇమేజ్‌ను కూడా జత చేశారు. 

అయితే రతన్‌ టాటా పేరుతో ఇలా తప్పుడు వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది ‘‘కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమైంది అని రతన్‌ టాటా చెప్పారు’’అంటూ ఓ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. దీనిపై అప్పట్లో కూడా టాటా క్లారిటీ ఇచ్చారు. 

మరోవైపు నిన్నటికి నిన్న మరో పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా పేరుతో కూడా ఓ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. ‘విద్యార్థుల జీవితాన్ని మార్చే సూచన’ అంటూ ఓ వార్తను తెగ షేర్‌ చేశారు. దీనిపై ఆయన నేడు స్పందిస్తూ.. తాను అలాంటి సూచనలేవీ చేయలేదని కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా.. సోషల్‌మీడియాలో నకిలీ వార్తల ప్రవాహంపై అటు సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వార్తల పట్ల సామాజిక మాధ్యమ వేదికలు బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని