రఫేల్‌.. రామమందిరం..గణతంత్ర విశేషాలు!

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆయా రాష్ట్రాలల్లో గవర్నర్లు జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరిస్తున్నారు. మరోవైపు దేశ రాజధాని దిల్లీలో వేడుకలకు సర్వం సిద్ధమైంది.....

Updated : 24 Jan 2024 17:16 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు ప్రధాని మోదీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా నిబంధనల కారణంగా ఈసారి వేడుకల్లో కాస్త ఆర్భాటాలు తగ్గాయనే చెప్పాలి. అయినప్పటికీ.. త్రివిధ దళాల సైనిక పాటవాల ప్రదర్శన, శకటాల రూపంలో ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగాయి. ఇటీవల భారత అమ్ములపొదిలో చేరిన రఫేల్‌ యుద్ధ విమానాలు, అయోధ్య రామమందిర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు సంబంధించిన మరికొన్ని విశేషాలు...

1971లో బంగ్లాదేశ్‌తో జరిగిన యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు గౌరవంగా.. నేడు రాజ్‌పథ్‌లో జరిగిన సైనిక కవాతుకు బంగ్లాదేశీ సాయుధ దళం నేతృత్వం వహించింది. తొలి ఆరు వరసల్లో పదాతి దళం, తర్వాతి రెండు వరుసల్లో నావికాదళం, వాయుసేన వరుసగా కవాతు చేశాయి.
ఎప్పటిలాగే పదాతిదళం తన ఆయుధ సంపత్తిని వేడుకల్లో సగర్వంగా ప్రదర్శించింది. రష్యన్‌ టీ-90 యుద్ధ ట్యాంకులు, టీ-72 బ్రిడ్డ్‌-లేయర్‌ ట్యాంక్‌, బీఎంపీ-2 ఆర్మోర్డ్‌ పర్సనల్‌ క్యారియర్‌, పినాక మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంఛర్‌, బ్రహ్మోస్‌ క్షిపణులు కవాతులో ఆకట్టుకున్నాయి.
రఫేల్‌ యుద్ధ విమానాల విన్యాసాలు వేడుకల్లో హైలైట్‌గా నిలిచాయి.
కరోనా నిబంధనల నేపథ్యంలో ఈసారి కంటింజెంట్లలో ఉండే సైనికుల సంఖ్యను కుదించారు. ఆర్మీ, నేవీ బృందాల్లో 144 మందికి బదులు 96 మందే పాల్గొంటున్నారు. 
నావికాదళం బంగ్లాదేశ్‌ యుద్ధ సమయంలో సేవలందించిన ఐఎన్‌ఎస్‌-విక్రాంత్‌ విమాన వాహక నౌకను ప్రదర్శించారు.

 ఆయా రాష్ట్రాలు ప్రదర్శించే శకటాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ రామమందిర శకటం అందరినీ ఆకట్టుకుంది. అయోధ్యలో నిర్మించనున్న రామాలయ ఆకృతిని ప్రతిబింబించేలా ఈ శకటాన్ని రూపొందించారు. అలాగే, ఇటీవలే ఉనికిలోకి వచ్చిన లద్ధాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతం తమ సంస్కృతిని ప్రతిబింబించే శకటాన్ని ప్రదర్శిస్తోంది. 

ఇవీ చదవండి..

సారీ ఇండియా.. రాలేకపోయాను!

వయస్సు 22, రిపబ్లిక్‌ ప్రదర్శనలు 18!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని