SBI: గర్భిణుల నియామకాల్లో మార్పులపై విమర్శలు.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ

మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI)

Published : 29 Jan 2022 16:51 IST

దిల్లీ: మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) జారీ చేసిన ఆదేశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ ఉత్తర్వులపై ఎస్‌బీఐ వెనక్కి తగ్గింది. కొత్త నిబంధనలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. నియామక ప్రక్రియలో ప్రస్తుతమున్న నిబంధనలనే కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శనివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. 

‘‘నియామకాల సమయంలో ఫిట్‌నెస్‌ ప్రమాణాలకు సంబంధించిన బ్యాంకు ఇటీవల నిబంధనలను సమీక్షించింది. ఆరోగ్య కారణాలు, ఇతర అంశాలను దృష్టిలో ఈ నిబంధనల్లో మార్పులు చేసింది. అయితే మార్పులు మహిళలపై వివక్షపూరితమంటూ కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. కానీ సంస్థలో 25శాతం సిబ్బంది మహిళలే. వారి సాధికారిత, సంరక్షణకు ఎస్‌బీఐ ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. కొవిడ్‌ సమయంలోనూ గర్భిణీలుగా ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని వెసులుబాటు కల్పించాం. అయినప్పటికీ ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని.. కొత్త నిబంధనలను ఉపసంహరించుకుంటున్నాం. నియామక ప్రక్రియలో పాత నిబంధనలే కొనసాగుతాయి’’ అని ఎస్‌బీఐ ట్విటర్‌ వేదికగా ఒక ప్రకటనలో వెల్లడించింది. 

‘‘నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారు. వారు బిడ్డను ప్రసవించాక 4 నెలల్లోపు ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామ’ని పేర్కొంటూ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిన్న ఆదేశాలు జారీ చేసింది. నూతన నియామకాలకు ఈ నిబంధన 2021 డిసెంబరు 21 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. పదోన్నతులపై వెళ్లే వారికి 2022 ఏప్రిల్‌ 1 నుంచి నూతన నిబంధన అమల్లోకి వస్తుందని బ్యాంక్‌ తెలిపింది. అయితే ఈ నిబంధనపై  ఆలిండియా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌తో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు దిల్లీ మహిళా కమిషన్‌ కూడా ఎస్‌బీఐకి నోటీసులు జారీ చేసింది. నూతన నిబంధనను సత్వరం వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే మార్పులపై ఎస్‌బీఐ వెనక్కి తగ్గింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని