EVM సోర్స్‌కోడ్‌పై ఆడిట్‌ నిర్వహించాలని పిల్‌.. నిరాకరించిన సుప్రీం కోర్టు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (EVM) ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌ను ఆడిట్‌ చేయాలని దాఖలైన పిల్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

Updated : 22 Sep 2023 14:00 IST

దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (EVM) ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌పై ఆడిట్‌ చేయాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు చూపించే ఆధారాలేవీ పిటిషనర్‌ సమర్పించలేదని పేర్కొంది. ఈవీఎం సోర్స్‌కోడ్‌పై ఆడిట్‌ నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం పరిశీలించింది. అనంతరం సదరు పిటిషన్‌ను కొట్టివేసింది.

‘ఎన్నికల నియంత్రణను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అప్పగించారు. అయితే, ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలను పిటిషనర్‌ కోర్టుకు అందించలేదు. ముఖ్యంగా ఈవీఎంలపై అనుమానాలు కలిగించే ఏ సమాచారాన్ని ఇవ్వలేదు’ అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం నోటీసులు

కొన్నేళ్ల క్రితం బ్యాలెట్‌ స్థానంలో తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలతో లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. అయితే, వాటి పనితీరుపై కొందరు అనేక సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈవీఎంలలో ఉపయోగించిన సోర్స్‌ కోడ్‌పై ఆడిట్‌ చేపట్టాలని కోరుతూ సునిల్‌ ఆహ్యా అనే వ్యక్తి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ‘సోర్స్‌ కోడ్‌ అనేది ఈవీఎంకు ఎంతో కీలకం. ఇది ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించింది’ అని అందులో పేర్కొన్నారు. ఇదే విషయంపై ఆడిట్‌ నిర్వహించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. అక్కడ చుక్కెదురయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని