Supreme Court: సుప్రీంకోర్టులో మొదలైన ప్రత్యక్ష ప్రసారాలు.. కేసుల విచారణ చూడండి..!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) చర్రితలో కొత్త ఒరవడి మొదలైంది. మంగళవారం(సెప్టెంబరు 27) నుంచి

Updated : 27 Sep 2022 14:54 IST

దిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) చర్రితలో కొత్త ఒరవడి మొదలైంది. మంగళవారం(సెప్టెంబరు 27) నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. ప్రస్తుతానికి యూట్యూబ్‌ వేదికగా వీటిని ప్రసారం చేస్తున్నారు. త్వరలోనే సొంత మాధ్యమం ఏర్పాటు చేసుకోనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు. లలిత్‌ నిన్న తెలిపారు.

ప్రత్యక్ష ప్రసారంలో తొలి విచారణ ‘సేన vs సేన’ కేసుపై జరిగింది. మహారాష్ట్ర శివసేన పార్టీలో శిందే వర్గం తిరుగుబాటు, ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం వంటి పరిణామాలపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అసలైన శివసేన తమదేనంటూ ఠాక్రే, శిందే వర్గాల మధ్య పోరు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.

ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారణలను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా ఇతర ధర్మాసనాలను కూడా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాట్లు చేస్తోంది. కేసుల విచారణలను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడానికి అనుకూలంగా సుప్రీం కోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆచరణలోకి రాలేదు. అయితే, భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పదవీ విరమణ రోజైన ఆగస్టు 26న.. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం అదే తొలిసారి. ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనం విచారణలను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ చారిత్రక నిర్ణయంతో  పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్‌ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూడొచ్చు.

మరి సుప్రీంకోర్టులో వాడీ వేడీ వాదనలు ఎలా కొనసాగుతున్నాయో మీరూ చూసేయ్యండి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని