Taliban vs Panjshir: తాలిబన్లకు ఎదురుదెబ్బ.. కమాండర్‌ ఫసీయుద్దీన్‌ హతం

పంజ్‌షేర్‌ వ్యాలీపై దండెత్తిన తాలిబన్లకు భారీ షాక్‌ తగిలింది. తాలిబన్ల సీనియర్‌ కమాండర్‌ ఫసీయుద్దీన్‌ మౌల్వీని రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్ఏ) మట్టుబెట్టాయి.....

Published : 07 Sep 2021 01:12 IST

కాబుల్‌: పంజ్‌షేర్‌ వ్యాలీపై దండెత్తిన తాలిబన్లకు భారీ షాక్‌ తగిలింది. తాలిబన్ల సీనియర్‌ కమాండర్‌ ఫసీయుద్దీన్‌ మౌల్వీని రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్ఏ) మట్టుబెట్టాయి. ఈశాన్య అఫ్గానిస్థాన్‌ గ్రూప్ చీఫ్ గానూ మౌల్వీ విధులు నిర్వహిస్తున్నారు. ఈ పోరులో ఆయనకు రక్షణగా ఉన్న మరో 13 మందిని కూడా రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ హతమార్చినట్లు సమాచారం.

అఫ్గాన్‌ను ఆక్రమించుకన్న తాలిబన్లు.. కొరకరాని కొయ్యగా మిగిలిన పంజ్‌షేర్‌పై ప్రస్తుతం దాడికి పాల్పడుతున్నారు. కొద్దిరోజులుగా సాగుతున్న ఈ పోరులో రెండు దళాలకు చెందిన అనేక మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 700 మంది దుష్టమూకలను హతమార్చినట్లు రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. తమ ప్రియతమ సోదరులను కూడా కోల్పోయినట్లు వెల్లడించాయి. ఎన్‌ఆర్‌ఎఫ్ఏ అధికార ప్రతినిధి అధిపతి ఫాహిమ్ దాస్తీతోపాటు అహ్మద్‌ మసూద్‌ మేనల్లుడు, జనరల్‌ అబ్దుల్ వదూద్ జోర్ వీరమరణం పొందినట్లు తెలిపాయి. కాగా పంజ్‌షేర్‌ లోయను పూర్తిస్థాయిలో హస్తగతం చేసుకొన్నామని తాలిబన్లు సోమవారం ప్రకటించారు.

అయితే తాలిబన్ల ప్రకటనను రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ నాయకుడు అహ్మద్‌ మసూద్‌ ఖండించారు. తాలిబన్ల దాడిని తిప్పికొడుతున్నట్లు తెలిపారు. తమ పోరాటం అజేయమైనదని.. తుది శ్వాస విడిచేంతవరకు పంజ్‌షేర్‌ కోసం పోరాడతామని పేర్కొన్నారు. తమపై దాడి చేసేందుకు తాలిబన్లకు పాకిస్థాన్‌ సాయమందిస్తోందని పేర్కొన్నారు. తాలిబన్లతో పోరాటం చేస్తూనే ఉంటామని ఫేస్‌బుక్‌ ఆడియో మెసేజ్‌ ద్వారా మసూద్‌ వెల్లడించారు. స్వేచ్ఛ కోసం దుష్టమూకలతో పోరాడాలని అఫ్గాన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని