
Afghanistan: తాలిబన్లే లక్ష్యంగా పేలుళ్లు.. ముగ్గురి మృతి
కాబుల్: అఫ్గాన్‌లో తాలిబన్లకు ఊహించని పరిణామం! వారి వాహనాలను లక్ష్యంగా చేసుకుని శనివారం వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. నంగర్‌హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లో ఈ దాడి చోటుచేసుకుంది. రోడ్డు పక్కన అమర్చిన మందు పాతరలు పేలడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు ఓ వార్తసంస్థకు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు తాలిబన్లు ఉన్నారనే వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయంపై స్పష్టత రాలేదు. మరోవైపు 20 మంది క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పౌరులే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, ఈ పేలుళ్లకు ఇంతవరకు ఎవరూ బాధ్యత వహించలేదు. మరోవైపు కాబుల్‌లోనూ ఓ బాంబు పేలి, ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై కూడా పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు అఫ్గాన్‌ను ఓ కంట కనిపెడ్తున్న తరుణంలో తరుణంలో ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికా సైన్యాల ఉపసంహరణ, పౌరుల తరలింపు సమయంలోనూ కాబుల్ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్లు సంభవించి, భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించిన విషయం తెలిసిందే.