The Kerala Story: ‘అది మా స్టోరీ కాదు’.. సినిమా వివాదంపై థరూర్ స్పందన

ప్రస్తుతం ఓ సినిమా కేరళలో వివాదాస్పదంగా మారింది. పలు రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అది మా స్టోరీ కాదంటూ ట్వీట్లు పెడుతున్నారు. (The Kerala Story)

Published : 01 May 2023 15:51 IST

తిరువనంతపురం: కేరళనాట ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story) వివాదం నడుస్తోంది. ఇది మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ఓ సినిమా. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) కూడా ఈ చిత్రంపై స్పందించారు. 

ఆ చిత్ర పోస్టర్‌ను షేర్ చేసిన ఆయన.. ‘ఇది మీ కేరళ కథ కావొచ్చు. మా కేరళ కథ మాత్రం కాదు’ అంటూ చిత్ర నిర్మాతలను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. కేరళలో కొన్నేళ్లుగా ‘32 వేల మంది’ మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ ఆరోపణలపై కేరళ స్టేట్‌ కమిటీ ఆఫ్‌ ముస్లిం యూత్ లీగ్ సవాలు విసిరింది. ఈ సినిమాలో చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించిన వ్యక్తికి రూ.కోటి ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో ఆధారాల స్వీకరణ కోసం కలెక్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. ఈ సవాలు గురించి శశిథరూర్‌ కూడా ట్విటర్‌లో పోస్టు పెట్టారు. అలాగే NotOurKeralaStory అనే హ్యాష్‌ ట్యాగ్‌ను షేర్ చేశారు. 

ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించే దుష్ప్రచారానికి ఉపక్రమిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్‌ గుప్తా స్పందించారు. ‘ముందుగా సినిమా చూడండి. ఒకవేళ మీకు నచ్చకపోతే అప్పుడు చర్చిద్దాం’ అని అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని