Covishield: 10కోట్ల ఉచిత డోసులు వాడుకోండి.. కేంద్రానికి సీరం విజ్ఞప్తి

ప్రపంచదేశాలకు కరోనా వ్యాక్సిన్‌ అందించే ఉద్దేశంతో ఏర్పాటైన కొవాక్స్‌ (COVAX) కార్యక్రమం కింద అందుబాటులో ఉన్న 10కోట్ల ఉచిత డోసులను వాడుకోవాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Published : 25 Apr 2022 02:22 IST

దిల్లీ: ప్రపంచదేశాలకు కరోనా వ్యాక్సిన్‌ అందించే ఉద్దేశంతో ఏర్పాటైన కొవాక్స్‌ (COVAX) కార్యక్రమం కింద అందుబాటులో ఉన్న 10కోట్ల ఉచిత డోసులను వాడుకోవాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఒకవేళ వీటిని ప్రభుత్వం వాడుకోకుంటే ప్రాణరక్షణగా నిలిచే వ్యాక్సిన్లు వృథా అవుతాయని పేర్కొంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ లేఖ రాసింది.

‘కొవాక్స్‌ కింద కరోనా టీకాలను గావి (GAVI) ప్రపంచ దేశాలకు ఉచితంగా సమకూరుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే భారత ప్రభుత్వానికి 14 కోట్ల కొవిషీల్డ్‌ డోసులను అందించింది. వీటికి అదనంగా మరో 10కోట్ల డోసులను గావి కేటాయించింది. ప్రస్తుతం దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున వీటిని వాడుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా ప్రస్తుతం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లవచ్చు’ అని కేంద్ర ఆరోగ్యశాఖకు రాసిన లేఖలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా పేర్కొంది.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 187.67 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. 18ఏళ్ల వయసుపైబడిన వారందరికీ ఏప్రిల్‌ 10 నుంచి ప్రికాషన్‌ డోసు తీసుకునే సౌలభ్యాన్ని కల్పించారు. ప్రస్తుతం ఇది ప్రైవేటులోనే ఉందుబాటులో ఉంది. మరోవైపు రెండో డోసు తీసుకొని 9నెలలు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే దీన్ని ఇస్తుండగా.. ఈ వ్యవధిని ఆరు నెలలకు తగ్గించాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని