S Jaishankar: పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్‌ జైశంకర్‌

నేపాల్ తన కరెన్సీ నోట్లపై కొన్ని భారతీయ భూభాగాలను చిత్రీకరించాలన్న నిర్ణయంపై విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందించారు.

Published : 05 May 2024 20:29 IST

కటక్ : నేపాల్ తన కరెన్సీ నోట్లపై కొన్ని భారతీయ భూభాగాలను చిత్రీకరించాలన్న నిర్ణయంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందించారు. పొరుగు దేశాలతో సంబంధాలను కొనసాగించడంలో కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. ‘‘మన పొరుగువారితో వ్యవహరించడంలో కొన్నిసార్లు రాజకీయ చిక్కులు ఉంటాయి. వీటి విషయంలో వారికి, మనకు ప్రయోజనకరంగా ఉండేలా ఆలోచించి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పొరుగు దేశాలన్నింటికీ భారత్‌ పట్ల సానుకూలత ఉండకపోవచ్చు. ఉదాహరణకు మీరు శ్రీలంక వంటి దేశాలను సందర్శిస్తే, అక్కడి ప్రభుత్వ అధికారులు కొన్ని సందర్భాల్లో మనకు ప్రతికూలంగా వ్యవహరించడం చూడొచ్చు’’అని జైశంకర్‌ అన్నారు.

కొవిడ్-19, ఉక్రెయిన్‌పై దాడి వంటి అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత్‌ ఇతర దేశాలకు అందించిన సహాయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. సంక్షోభంలో ఉన్న దేశాలకు భారత్‌ ఆర్థికంగా, ఇతర మార్గాల్లో సహాయం అందించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. పొరుగు దేశాలు కొరత ఎదుర్కొన్నప్పుడు ఉల్లిపాయల వంటి నిత్యావసరాల కోసం కూడా అభ్యర్థిస్తాయన్నారు.

నేపాల్ కొన్ని భారతీయ భూభాగాలను తన కరెన్సీ నోట్లపై చేర్చాలనే నిర్ణయంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద ప్రాంతాలైన లిపులేఖ్‌, లింపియాధురా, కాలాపానీలతో కూడిన భూభాగాల చిత్రాలను తమ 100 రూపాయల నోట్లపై పొందుపర్చాలని నేపాల్ క్యాబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని