Nitin Gadkari: ఇకపై ఫోన్‌ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదు, కానీ..: గడ్కరీ

డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కితే చలాన్లు, జరిమానాలు తప్పవు. అయితే త్వరలో.. ఫోన్‌ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదట

Published : 13 Feb 2022 01:25 IST

దిల్లీ: డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కితే చలాన్లు, జరిమానాలు తప్పవు. అయితే త్వరలో ఫోన్‌ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదట. స్వయంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంట్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయట. మొబైల్‌ను నేరుగా చేతితో పట్టుకోకుండా ఇయర్‌ఫోన్స్‌ ద్వారా ఫోన్‌ మాట్లాడితే దాన్ని నేరంగా పరిగణించకూడదని ఆయన అన్నారు. ఇటీవల లోక్‌సభలో మాట్లాడుతూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

‘‘ఇకపై కారు నడిపే డ్రైవర్‌ హ్యాండ్‌ ఫ్రీ డివైజ్‌లను (బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్స్‌) ఉపయోగించి ఫోన్లో మాట్లాడితే అప్పుడు దాన్ని నేరంగా పరిగణించలేం. అయితే అప్పుడు ఫోన్‌ కార్లో పెట్టకుండా డ్రైవర్‌ జేబులో పెట్టుకోవాలి. దీనికి ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు వేయకూడదు. ఒకవేళ ఎవరైనా జరిమానా విధిస్తే.. దాన్ని కోర్టులో సవాల్‌ చేసే అవకాశం ఉంటుంది’’ అని గడ్కరీ తెలిపారు. అయితే మొబైల్‌ నేరుగా చేతిలో పట్టుకుని ఫోన్‌ మాట్లాడితే మాత్రం ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు వేయొచ్చని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ నిర్ణయం వాహనదారులకు కాస్త ఊరటనిచ్చే వార్తే అయినప్పటికీ.. కొందరు దీన్ని అలుసుగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రమాదం లేకపోలేదు. ఫోన్‌ మాట్లాడుతున్నామని చెబుతూనే.. చెవిలో బ్లూటూత్‌ వంటివి పెట్టుకుని పాటలు వింటూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తే ప్రమాదం బారిన పడే అవకాశముందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని