SC Reservations: వారికి ఎస్సీ హోదా సాధ్యమేనా? గతంలో ఏం జరిగింది? ఇప్పుడేంటి?

దళిత క్రిస్టియన్లు, దళిత ముస్లింలకు షెడ్యూల్డ్‌ కులాల(ఎస్సీ) రిజర్వేషన్‌ హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Updated : 08 Oct 2022 10:46 IST

దళిత క్రిస్టియన్లు, దళిత ముస్లింలకు షెడ్యూల్డ్‌ కులాల(ఎస్సీ) రిజర్వేషన్‌ హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వీరి స్థితిగతులపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్‌ సారథ్యంలో కొత్త కమిటీని కేంద్రం ఏర్పాటు చేయటమే ఇందుకు కారణం. అసలేమిటీ సమస్య? ఎందుకీ సమస్య? ఎన్నాళ్లుగా నానుతోందని ఒక్కసారి తరచి చూస్తే...


ఎవరికి ఎస్సీ రిజర్వేషన్లు?

* దేశంలో తరతరాల సామాజిక అవలక్షణం... అంటరానితనం కారణంగా ఎస్సీలను బాధితులైన వర్గాలుగా భావించి రాజ్యాంగం వారికి రిజర్వేషన్లను కల్పించింది. 1950లో కేవలం హిందువుల్లోని ఎస్సీలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పించారు. తర్వాత 1956లో సిక్కు మతంలోని దళితుల్నీ, 1990లో బౌద్ధ దళితుల్ని ఇందులో చేర్చారు.

* ప్రస్తుత నిబంధనల ప్రకారం... హిందు, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోని దళితుల్ని ఎస్సీలుగా పరిగణించరు.

* అంటే... క్రైస్తవం, ఇస్లాంల్లోకి మతమార్పిడి అయిన దళితులకు ఎస్సీ  ప్రయోజనాలు వర్తించవు.


గతంలో ఏం జరిగింది?

క్రైస్తవ,  ముస్లిం మతాల్లోకి మారిన దళితులకూ రిజర్వేషన్లు వర్తింపజేయాలంటూ చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. ఈ మేరకు...
* 1996లో ప్రభుత్వం రాజ్యాంగ (ఎస్సీ) ఆదేశాల (సవరణ) బిల్లును తయారు చేసింది. కానీ పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు.

* రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. 2004లో మత, భాష పరమైన మైనార్టీలకు జాతీయ కమిషన్‌... దీన్నే రంగనాథ్‌ మిశ్ర కమిషన్‌ అంటారు. ఈ కమిషన్‌ ఎస్సీ హోదాకు, మతానికి లంకె అవసరం లేదని సిఫార్సు చేసింది.

* రెండోది జస్టిస్‌ రాజేందర్‌ సచార్‌ కమిషన్‌. దేశంలో ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యాసంబంధ పరిస్థితులపై 2005లో ఈ కమిటీ ఏర్పాటైంది. మత మార్పిడి తర్వాత కూడా దళిత ముస్లిం, దళిత క్రైస్తవుల పరిస్థితుల్లో మార్పు లేదని ఏడుగురు సభ్యుల సచార్‌ కమిషన్‌ తేల్చింది.

* క్షేత్రస్థాయిలో పరిస్థితిని బేరీజు వేయటానికి అవసరమైన గణాంకాలు లేవనే కారణంతో ఈ కమిషన్‌ సిఫార్సులను ఆమోదించలేదు.

* తర్వాతికాలంలో సామాజిక శాస్త్రవేత్త సతీశ్‌ దేశ్‌పాండే సారథ్యంలోని ఓ కమిటీ 2008లో ఓ నివేదిక ఇచ్చింది. దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకూ ఎస్సీ హోదా విస్తరించాలంటూ సిఫార్సు చేసింది. జాతీయ మైనార్టీ కమిషన్‌ కూడా ఇలాంటి ప్రతిపాదనలే చేసింది.

* కానీ... సరైన గణాంకాలు లేనందున వీటన్నింటనీ పరిగణనలోకి తీసుకోలేదు.


ఇప్పుడేంటి?

* దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకూ ఎస్సీ హోదా కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై మీ అభిమతం ఏంటో స్పష్టం చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల కేంద్రాన్ని కోరింది. సుప్రీంకోర్టులో ఈనెల 11న ఈ అంశం విచారణకు రాబోతోంది.

* ఈ నేపథ్యంలో... హిందు, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారిన దళితుల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులను అధ్యయనం చేయటానికి జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఎస్సీ హోదా విస్తరింపజేయటం ద్వారా తలెత్తే పరిణామాలను కూడా కొత్త కమిటీ అధ్యయనం చేస్తుంది.


ఎస్టీలు, ఓబీసీలకు ఆ నిబంధన లేదు

* ఎస్టీ హోదా, ప్రయోజనాల విషయంలో మాత్రం ఇలాంటి మతపరమైన పరిమితులు లేవు.

* ప్రభుత్వ ఆదేశాల ప్రకారం... ఎస్టీల హక్కులు వారి మతం, విశ్వాసాలకు అతీతమైనవి. అంటే ఎస్టీలు ఏ మతంలో ఉన్నా వారికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్‌ తదితర ప్రయోజనాలు దక్కుతాయి.

* మండల్‌ కమిషన్‌ నివేదిక అమలు కారణంగా పలు క్రిస్టియన్‌, ముస్లిం వర్గాలకూ ఓబీసీ జాబితాలో చోటు దక్కింది. అలా... ఎస్టీలు, ఓబీసీలకు మతాలకు అతీతంగా రాజ్యాంగ ప్రయోజనాలు అమలవుతున్నాయి.


- ఈనాడు ప్రత్యేక విభాగం

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని