
కొవిడ్ కేసుల్లో పెరుగుదల.. సుప్రీంలో మళ్లీ వర్చువల్ హియరింగ్
దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి (సోమవారం) వర్చువల్ పద్ధతిలో కేసుల విచారణ జరుగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. రెండు వారాల పాటు ఈ విధానంలోనే కేసుల విచారణ జరగనుందని పేర్కొంది. కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది.
దేశంలో కొవిడ్ కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 27 వేలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇతర ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో ఆదివారం 3,194 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం సైతం 2,716 కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష విచారణను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. గతంలో కొవిడ్ కేసుల వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పుడు సైతం సుప్రీం కోర్టులో వర్చువల్‌గానే విచారణలు జరిగాయి.