Supreme Court: న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం ఫ్యాషనైపోయింది: సుప్రీం ఆగ్రహం

ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థను సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది.

Updated : 03 Dec 2022 07:25 IST

దిల్లీ: ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థను సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. దీన్ని పట్టాలు తప్పించే ప్రయత్నాలు చేయకూడదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవస్థపై మాజీ జడ్జీలు ఏదో అంటే.. వాటిని తాము పట్టించుకోబోమని తెలిపింది. సుప్రీంకోర్టు .. దేశంలోనే అత్యంత పారదర్శక సంస్థల్లో ఒకటి అని పేర్కొంది. సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం ఉద్యమకారిణి అంజలీ భరద్వాజ్‌ వేసిన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2018 డిసెంబరు 12న జరిగిన కొలీజియం సమావేశ వివరాలు ఇవ్వాలని కోరుతూ భరద్వాజ్‌ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీన్ని న్యాయస్థానం కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా అంజలి తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తన వాదనలు వినిపిస్తూ.. ఆనాటి కొలీజియం సమావేశ వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదని మాజీ జడ్జి జస్టిస్‌ ఎం.బి.లోకూర్‌ వ్యాఖ్యానించారని, ఆయన కూడా నాటి సమావేశంలో పాల్గొన్నారని న్యాయమూర్తుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఒకప్పుడు కొలీజియంలో ఉన్నవాళ్లే(మాజీ జడ్జీలు).. ఆ వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం ఇటీవల కాలంలో ఓ ఫ్యాషనైపోయిందని పేర్కొంది. అలాంటి వ్యాఖ్యలపై తాము స్పందించబోమని తెలిపింది. ‘‘ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ పట్టాలు తప్పకుండా పనిచేయనీయండి. సంబంధం లేని వ్యక్తులు ఏదో అన్నారని.. దాని ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేయదు. సుప్రీంకోర్టు దేశంలోనే అత్యంత పారదర్శక వ్యవస్థల్లో ఒకటి’’ అని ధర్మాసనం పేర్కొంటూ.. పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని