Padma awards: ‘పద్మ’ తిరస్కారం: బెంగాల్‌ నుంచే ముగ్గురూ.. కారణమేంటి?

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కరాలను తిరస్కరించిన వాళ్ల జాబితా మూడుకు చేరింది. బెంగాల్‌కు చెందిన సీపీఎం సీనియర్‌ నేత, ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ ఇప్పటికే తమకు ప్రకటించిన పురస్కారాన్ని తిరస్కరించినట్లు పేర్కొనగా.. తాజాగా ఆ జాబితాలో ప్రముఖ తబలా వాయిద్యకారుడు పండిత్‌ అనింద్య ఛటర్జీ కూడా చేరారు.

Published : 26 Jan 2022 18:37 IST

కోల్‌కతా: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కరాలను తిరస్కరించిన వాళ్ల జాబితా మూడుకు చేరింది. బెంగాల్‌కు చెందిన సీపీఎం సీనియర్‌ నేత బుద్ధదేవ్‌ భట్టాచార్య, ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ ఇప్పటికే తమకు ప్రకటించిన పురస్కారాన్ని తిరస్కరించినట్లు పేర్కొనగా.. తాజాగా ఆ జాబితాలో ప్రముఖ తబలా వాయిద్యకారుడు పండిత్‌ అనింద్య ఛటర్జీ కూడా చేరారు. ఈ ముగ్గురూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారే కావడం గమనార్హం.

తనకు కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కరాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు అనింద్య ఛటర్జీ తాజాగా వెల్లడించారు. ‘నాకు పురస్కారం ప్రకటించినందుకు ధన్యవాదాలు. అయితే, పురస్కారం తీసుకునేందుకు సిద్ధంగా లేను. అదే పదేళ్ల క్రితమే ప్రకటించి ఉంటే గౌరవంగా తీసుకునేవాడిని. ఎంతోమంది నా సహచరులు, నా జూనియర్లకు ఏళ్ల క్రితమే పద్మశ్రీ అవార్డులు వరించాయి. కారణం ఏదైనా సరే.. ఈ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నా’’ అని ఛటర్జీ పేర్కొన్నారు. పండిట్‌ రవిశంకర్‌, ఉస్తాద్‌ అంజాద్‌ అలీ ఖాన్‌, ఉస్తాద్‌ అలీ అక్బర్‌ ఖాన్‌ వంటి ప్రముఖులతో వేదిక పంచుకున్న అనింద్య ఛటర్జీకి 2002లో సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది.

మా పార్టీ విధానం కాదు: బుద్ధదేవ్‌

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్‌ పురస్కారాన్ని సీపీఎం సీనియర్‌ నేత, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య తిరస్కరించారు. ‘‘పద్మ అవార్డు సంగతి నాకు తెలియదు. దాని గురించి ఎవరూ చెప్పలేదు. ఒకవేళ నన్ను ఆ పురస్కారానికి ఎంపిక చేసి ఉంటే.. దాన్ని తిరస్కరిస్తున్నా’’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుద్ధదేవ్‌తో పాటు పార్టీ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి అవార్డులు స్వీకరించడం తమ విధానం కాదని ఆ పార్టీ.. ట్విటర్‌లో పేర్కొంది. తాము పనిచేసేది ప్రజల కోసమని, అవార్డుల కోసం కాదని తెలిపింది. గతంలో తమ పార్టీ సీనియర్‌ నేత ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ కూడా ఇదే రీతిలో అవార్డును తిరస్కరించారని వివరించింది.

స్థాయిని తగ్గించడమే..

పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించేందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ కూడా నిరాకరించారు. అవార్డు ప్రకటించేందుకు సమ్మతించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు తనను సంప్రదించినప్పుడు ఆమె ఈ మేరకు స్పష్టంచేశారు. ‘‘90 ఏళ్ల వయస్సులో.. దాదాపు 8 దశాబ్దాల పాటు పాటలు పాడిన వ్యక్తికి ‘పద్మశ్రీ’ని ప్రకటించడమంటే.. ఆమె స్థాయిని తగ్గించడమే’’ అని సంధ్యా ముఖర్జీ కుమార్తె సౌమి సేన్‌గుప్తా స్పష్టంచేశారు. పద్మశ్రీ పురస్కారాన్ని ఒక జూనియర్‌ ఆర్టిస్ట్‌కు ఇవ్వడం సబబని, సంధ్యా ముఖర్జీ లాంటి గాయనికి ఇవ్వజూపడం తగదని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని