Modi: 100ఏళ్లకోసారి వచ్చే సమస్య.. వంద రోజుల్లో పరిష్కరించలేం: మోదీ

‘‘వందేళ్లలోనే అతిపెద్ద సంక్షోభమైన కరోనా కారణంగా ఏర్పడిన దుష్ప్రభావాలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం.  వీటిని 100 రోజుల్లోనే పరిష్కరించలేం వీటినుంచి బయటపడేందుకు రిస్క్‌ చేయక తప్పలేదు’’ - ప్రధానమంత్రి నరేంద్రమోదీ

Published : 23 Oct 2022 01:52 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ‘రోజ్‌గార్‌ మేళా’ను ప్రారంభించారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 75వేల మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఇదో కీలక మైలురాయి అని అభివర్ణించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ప్రస్తుతం ప్రపంచం పరిస్థితి బాగోలేదు. కరోనా మహమ్మారి కారణంగా మనం వందేళ్లలోనే అదిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. దీని ప్రభావం ప్రతి చోటా ఉంది. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా సతమతమవుతున్నాయి. కరోనా దుష్ప్రభావాలైన నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం చాలా దేశాల్లో గరిష్ఠాలకు చేరుతున్నాయి. ఇలాంటి సమస్యలను కేవలం 100 రోజుల్లో పరిష్కరించుకోలేం. ఈ సవాళ్ల నుంచి బయటపడేందుకు భారత్‌ కూడా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కొన్ని సాహసాలు చేయక తప్పట్లేదు. అడ్డంకులు ఎదురైనప్పటికీ ప్రజల ఆశీర్వాదం, సహకారంతో దేశాన్ని ఆర్థికంగా రక్షించుకోగలుగుతున్నాం’’ అని మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఐదో ఆర్థికశక్తిగా అవతరించడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లలో మన దేశం 10వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకిందని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు, భాజపా ఎంపీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన యువతకు మోదీ నియామకపత్రాలను పంపించగా.. వాటిని మంత్రులు, ఎంపీలు అందజేశారు. ఇప్పుడు కొత్తగా నియమితులైన 75వేల మంది.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 38 మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని