lockdown: తమిళనాట ఒక్క రోజు లాక్‌డౌన్‌.. నిర్మానుషంగా రోడ్లు

తమిళనాట కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆదివారాలు లాక్‌డౌన్‌ అమలు చేయాలని స్టాలిన్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. దాదాపు 10నెలల..

Updated : 09 Jan 2022 22:17 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఒక్క రోజే రూ.210కోట్ల మద్యం విక్రయం

చెన్నై: తమిళనాట కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆదివారాలు లాక్‌డౌన్‌ అమలు చేయాలని స్టాలిన్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. దాదాపు 10నెలల తర్వాత ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేశారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలవుతుండగా.. ఆదివారం మాత్రం ఒక్కరోజు పూర్తి లాక్‌డౌన్‌ అమలు చేశారు. వ్యాప్తి నియంత్రణలోకి వచ్చి కేసులు తగ్గుతాయని లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రజలందరూ విధిగా నిబంధనలు పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి మాసుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. పాలు, అత్యవసర కార్యకలాపాలు, వైద్యసేవలు వంటి వాటికి మాత్రం అనుమతి ఇచ్చారు.

లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలోని జాతీయ రహదారులతో పాటు అన్ని రోడ్లన్నీ బోసిపోయాయి. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలు, శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తుల వాహనాలను మాత్రం అనుమతించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దుకాణాలు మూతపడటంతో నిర్మానుషంగా మారాయి. కొన్ని చోట్ల రహదారులపై అనవసరంగా వచ్చే వాహనదారులపై పోలీసులు నిఘా ఉంచి వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. సబర్బన్‌ రైళ్లలో 50శాతం ప్రయాణికులను మాత్రమే అనుమతించారు. విమానాలు, దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు యథావిథిగా నడిచాయి. మెట్రోరైల్‌ సహా రోడ్డు రవాణా సంస్థ బస్సులు, ఇతర ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. ఫ్లైఓవర్లు, హైవేలను మూసివేసిన పోలీసులు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి అనవసరంగా బయటకు వచ్చిన వారిపై చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వాహనాలను సీజ్‌ చేసిన అధికారులు మాస్క్‌లు ధరించని వారికి జరిమానా విధించారు. తమిళనాట శనివారం 10,978 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, చెన్నై నగరంలో మాత్రమే 5,098 కేసులు నమోదయ్యాయి.

లాక్‌డౌన్‌ అని తెగతాగేశారు

తమిళనాడులో ఆదివారం లాక్‌డౌన్‌ నేపథ్యంలో శనివారం రూ.210కోట్ల రూపాయల మద్యం విక్రయం విక్రయం జరిగిందని రాష్ట్రంలో మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ (టాస్మాక్‌) వెల్లడించింది. సాధారణంగా శని, ఆదివారాల్లో మద్యం విక్రయం రూ.300 కోట్ల మేర ఉండగా శనివారం ఒక్క రోజే రూ.210 కోట్ల విక్రయం జరిగినట్లు తెలిపారు. చెన్నైతో పాటు సమీప జిల్లాలైన కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్‌ జిల్లాల్లో 25 శాతం అదనంగా మద్యం విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని