UN: అఫ్గాన్‌ పట్టు కోల్పోతోంది.. మహిళల పరిస్థితి దయనీయంగా మారుతోంది

తాలిబాన్లు వేగంగా చొచ్చుకొనివస్తుండటంతో అఫ్గానిస్థాన్ నియంత్రణ కోల్పోతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబాన్లు తక్షణమే దాడులు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. బలప్రయోగం సుదీర్ఘమైన అంతర్యుద్ధానికి దారితీస్తుందని, దేశాన్ని ఒంటరిని చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Updated : 14 Aug 2021 12:51 IST

తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి

జెనీవా: తాలిబాన్ల దురాక్రమణలతో అఫ్గానిస్థాన్ నియంత్రణ కోల్పోతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబాన్లు తక్షణమే దాడులు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. బలప్రయోగం సుదీర్ఘమైన అంతర్యుద్ధానికి దారితీస్తుందని, దేశాన్ని ఒంటరిని చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 

‘అఫ్గానిస్థాన్ నియంత్రణ కోల్పోయింది. ఇప్పటికే ఈ తరహా ఘర్షణలను చవిచూసిన దేశం మరోసారి క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకుంది. ఇది అక్కడి ప్రజలకు తీరని విషాదం. అఫ్గాన్‌ వాసుల ప్రయోజనాల కోసం తాలిబాన్లు వెంటనే ఈ దాడుల్ని నిలిపివేయాలి. విశ్వాసంతో చర్చలు జరపాలి. బలప్రయోగం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది సరైన మార్గం కాదు. అది సుదీర్ఘమైన అంతర్యుద్ధానికి దారి తీస్తుంది. అఫ్గాన్‌ను ఒంటరిని చేస్తుంది. అధికారం కోసం యుద్ధమార్గాన్ని అవలంబిస్తోన్న వారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలి’ అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

అగ్రరాజ్య సేనలు హఠాత్తుగా అఫ్గాన్‌ను వీడటంతో తాలిబాన్లు తమ ఉనికి చాటడం ప్రారంభించారు. కొద్దికాలంలోనే 60 శాతానికి పైగా దేశం వారి వశమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరోవారంలో దేశం మొత్తాన్ని హస్తగతం చేసుకుంటామని వారు ఇప్పటికే ప్రకటించారు. అలాగే వారు కాబూల్ సమీపంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో ప్రజల హక్కులు అణచివేతకు గురైనట్లు నివేదికలు వెలువడుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికల పరిస్థితి దయనీయంగా మారినట్లు వస్తోన్న వార్తలపై గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘తాలిబాన్ల ఆధీనంలోని ప్రాంతాల్లో మహిళలు, పాత్రికేయులను లక్ష్యంగా చేసుకొని.. మానవ హక్కులపై ఆంక్షలు విధిస్తున్నారనే నివేదికలతో కలత చెందాను. ఈ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. పౌరులపై దాడులకు తెగబడటం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. అది యుద్ధనేరానికి ఏ మాత్రం తీసిపోదు’ అని గుటెరస్ హెచ్చరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని