
Winter session: ఆ రోజున పార్టీ ఎంపీలందరూ సభకు రావాల్సిందే.. విప్ జారీ చేసిన భాజపా
దిల్లీ: మూడు సాగు చట్టాల రద్దుకు సంబంధించి కేంద్రం తదుపరి ప్రక్రియను ప్రారంభించింది. సోమవారం నుంచి పార్లమెంట్ శీతకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో.. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజున భాజపా ఎంపీలందరూ లోక్‌సభకు హాజరుకావాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. రాజ్యసభ ఎంపీలకు దీనిపై ఇప్పటికే విప్ జారీ అయ్యింది.
ఈసారి సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదానికి 26 బిల్లులు ఎదురుచూస్తున్నాయి. అందులో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కూడా ఒకటి. దాంతో పాటు వివాదాస్పద క్రిప్టో కరెన్సీ బిల్లు, అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వం వాటాను 51 శాతం నుంచి 26 శాతానికి తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి.
కేంద్రం గత ఏడాది వర్షాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. వాటిపై పంజాబ్, హరియాణా, యూపీలోని కొన్ని ప్రాంతాల రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. వారు చేపట్టిన నిరసనల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. కొద్ది రోజుల క్రితం సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.