China Tv Shows: టీవీ షోల్లో అలాంటి పురుషులు నిషేధం..!

పలు రంగాల్లో నియంత్రణ చర్యలు, ఆంక్షలు చేపడుతోన్న చైనా.. తాజాగా టీవీల్లో రియాలిటీ షోలపైనా చర్యలకు ఉపక్రమించింది. టీవీ షోల్లో ఆడంగిలా ప్రవర్తించే పురుషులను ప్రోత్సహించవద్దంటూ.. అటువంటి వారిపై నిషేధం విధించింది.

Updated : 22 Nov 2022 13:58 IST

పలు రంగాల్లో కొనసాగుతోన్న ఆంక్షలు

బీజింగ్‌: పలు రంగాల్లో నియంత్రణ చర్యలు, ఆంక్షలు చేపడుతోన్న చైనా.. తాజాగా టీవీల్లో రియాలిటీ షోలపైనా చర్యలకు ఉపక్రమించింది. టీవీ షోల్లో మహిళల్లా ప్రవర్తించే పురుషులను ప్రోత్సహించవద్దంటూ.. అటువంటి వారిపై నిషేధం విధించింది. కేవలం టీవీల్లో విప్లవాత్మక సంస్కృతిని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు ఉండాలని ప్రసార మాధ్యమాలకు సూచించింది. ముఖ్యంగా ఇతర దేశాలకు చెందిన గాయకులతో ప్రభావితమవుతోన్న చైనా పాప్‌ స్టార్లు.. చైనా యువతను ధైర్యవంతులైన పురుషులుగా (Masculine) తీర్చిదిద్దడంలో విఫలమవుతున్నారనే ఆందోళన నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

మహిళల్లా ప్రవర్తించే పురుషులు (Sissy men), వికృత స్వభావం ఉన్న వ్యక్తులకు ప్రసార మాధ్యమాలు కచ్చితంగా ముగింపు పలకాలని నేషనల్‌ రేడియో అండ్‌ టీవీ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. ముఖ్యంగా అసభ్య ఇంటర్నెట్‌ సెలబ్రిటీలు, సంపన్న, ప్రముఖులను కీర్తించే కార్యక్రమాలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. వీటికి బదులుగా చైనా విప్లవాత్మక సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆధునిక సామ్యవాద భావజాలాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అయితే, దక్షిణకొరియా, జపాన్‌కు చెందిన గాయకులు, నటుల ఫ్యాషన్‌ లుక్‌లతో చైనా పాప్‌స్టార్లు ప్రభావితమవుతున్నట్లు భావిస్తోన్న చైనా.. తమ యువతను మాత్రం పిరికి వారిలా మారుస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సెలబ్రిటీల ప్రభావం చిన్నారులు, యువతపై ఉండకుండా చూసేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే, వాణిజ్యం, విద్యా, సంస్కృతి, మతపరమైన అంశాలపై నియంత్రణ చర్యలకు ఉపక్రమించిన చైనా.. ‘జాతీయ పునరుజ్జీవనం’ అనే కార్యక్రమానికి అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ముఖ్యంగా శక్తిమంతమైన చైనా, ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా టెక్‌ కంపెనీలు, సోషల్‌ మీడియా, ఈ-కామర్స్‌ సంస్థలపైనా నియంత్రణ చర్యలను మొదలుపెట్టారు. తాజాగా టీవీ రంగంపై దృష్టిపెట్టిన జిన్‌పింగ్‌.. సెలబ్రిటీలకు ఆకర్షితమవడాన్ని అనారోగ్య వాతావరణంగానే భావిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను ప్రముఖుల వినోద కార్యక్రమాలకు ప్రభావితం కాకుండా.. వారిని నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరహాలో పిల్లలు ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడే సమయాన్ని తగ్గించాలని నిర్ణయించారు. కేవలం వారానికి మూడు గంటలకంటే ఎక్కువగా ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడకుండా వారిపై ఆంక్షలు విధించారు. ఇక పాఠశాలలు ఉన్న రోజుల్లో వీటిపై పూర్తిగా నిషేధం విధిస్తారు. ఇప్పటికే వైబో వంటి మైక్రో బ్లాగ్‌లలో వినోద వార్తలు, ఫ్యాన్‌ క్లబ్‌లకు సంబంధించిన వేలకొద్దీ అకౌంట్లను తొలగించారు. మరికొంతమంది సెలబ్రిటీల అకౌంట్లు కూడా కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని