Taliban Victory: తాలిబన్ల విజయం.. పాకిస్థాన్‌ అధికారుల సంబరాలు..!

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు మెరుపు వేగంతో ఆక్రమించుకోవడంలో పాకిస్థాన్‌తో పాటు అక్కడి నిఘా విభాగం కీలక పాత్ర పోషించినట్లు అమెరికాకు చెందిన చట్టసభ్యుడు ఆరోపించారు.

Published : 24 Aug 2021 01:43 IST

అసహ్యం వేసిందన్న అమెరికా చట్టసభ సభ్యులు

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు మెరుపు వేగంతో ఆక్రమించుకోవడంలో పాకిస్థాన్‌తో పాటు అక్కడి నిఘా విభాగం కీలక పాత్ర పోషించినట్లు అమెరికాకు చెందిన చట్టసభ్యుడు ఆరోపించారు. తాలిబన్ల విజయం పట్ల అఫ్గాన్‌లు ఓవైపు ఆందోళన చెందుతుంటే.. పాకిస్థాన్‌ అధికారులు మాత్రం సంబరాలు చేసుకోవడం చూడడానికి అసహ్యంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక అఫ్గాన్‌ సంక్షోభ సమయంలో దేశం విడిచి వచ్చేవారికి భారత్‌ ఆశ్రయం కల్పించేందుకు సిద్ధమవడాన్ని ఆయన స్వాగతించారు. అమెరికాలోని ఓ భారత కాకస్‌కు (సమూహాల) నేతృత్వం వహిస్తోన్న అమెరికా చట్టసభ సభ్యుడు స్టీవ్‌ ఛాబొట్‌ అఫ్గాన్‌ పరిణామాలపై స్పందించారు.

‘పాకిస్థాన్‌లో మతపరమైన మైనార్టీలపై జరిగే హింసాత్మక సంఘటనపై అమెరికాలో చర్చ ఆశించిన రీతిలో జరగడం లేదు. ముఖ్యంగా కిడ్నాప్‌లు, బలవంతపు మార్పిడిలతో పాటు మైనర్‌ బాలికలకు వివాహాలు జరిపించడం వంటి దారుణాలు పాకిస్థాన్‌లో చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి దారుణాలపై ఇక్కడి పౌరులకు మరింత అవగాహన కల్పించేందుకు కృషి చేయాల్సి ఉంది’ అని భారత్‌కు చెందిన హిందూ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా చట్టసభ సభ్యుడు స్టీవ్ ఛాబొట్‌ వెల్లడించారు. కేవలం ఇవి ఆరోపణలు కాదని.. ఇటువంటి ఘటనలపై ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చాయని గుర్తుచేశారు. ఇక అమెరికాలో దాదాపు 60లక్షల హిందూ జనాభా ఉందని.. అమెరికా సమాజంలో వారు కలిసిపోయారని అన్నారు. అయితే, అమెరికాలోనూ కొన్ని చోట్ల పలు వర్గాలు వివక్షకు గురవుతున్నట్లు నివేదికలు రావడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వాటికి ముగింపు పలకాల్సిందేనని స్టీవ్‌ ఛాబొట్‌ స్పష్టం చేశారు.

ఇక అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో అమెరికాతో పాటు వివిధ దేశాల పౌరులు, రాయబార సిబ్బందిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గడువు ముగిసిన తర్వాత అమెరికా బలగాలు ఇంకా అఫ్గాన్‌లోనే ఉంటే పర్యవసానాలు తప్పవని తాలిబన్‌లు హెచ్చరించారు. ఆగస్టు 31 అమెరికాకు ‘రెడ్‌ లైన్‌’ అని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని