Om Birla: లోక్‌సభ నుంచి మీ కార్యాలయాలను నడపొద్దు..!

పార్లమెంట్‌ సభ్యులతో కొందరు కేంద్ర మంత్రులు సంభాషిస్తుండడం పట్ల స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 14 Dec 2021 23:06 IST

మంత్రుల తీరుపై స్పీకర్‌ ఓం బిర్లా అసంతృప్తి

దిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో పలు అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో పార్లమెంట్‌ సభ్యులతో కొందరు కేంద్ర మంత్రులు సంభాషిస్తుండటం పట్ల స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ కొనసాగుతున్న సమయంలోనే వివిధ సమస్యల గురించి సభ్యులతో ముచ్చటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో మీ కార్యాలయాలను సభ నుంచి సాగించవద్దంటూ మంత్రులకు స్పష్టం చేశారు.

లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌తో ఏదో సమస్యలపై ముచ్చటించేందుకు ఓ సభ్యుడు ఆయన సీటు వద్దకు వెళ్లారు. ఇది గమనించిన స్పీకర్‌ ఓం బిర్లా.. ‘గౌరవ సభ్యులు, మంత్రులు తమ కార్యాలయాలను సభ నుంచి నడపవద్దు. వారి వారి కార్యాలయాల్లో మాత్రమే కలవాలని సభ్యులకు మంత్రులు సూచించాలి’ అని వ్యాఖ్యానించారు. సభ మర్యాదను కాపాడాలని అన్నారు. అదే సమయంలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిందని ప్రకటించినప్పటికీ కేంద్రమంత్రి కైలాశ్‌ చౌధరి తన సమాధానాన్ని కొనసాగించడంతో స్పీకర్‌ ఆయన్ను మందలించారు.

ఇదిలాఉంటే, లోక్‌సభ కార్యకలాపాలు కొనసాగుతోన్న సమయంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి కలవడం ఒక్కోసారి చూస్తుంటాం. వారి ప్రాంత సమస్యలను ఆయా శాఖల మంత్రులతో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, సభ మధ్యలో ఇటువంటివి చోటుచేసుకోవడం సభా కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తున్నాయనే ఉద్దేశంతో అటువంటి కొనసాగించవద్దని మంత్రులు, సభ్యులకు లోకసభ స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని