Dengue Alert: కలవరపెడుతోన్న డెంగీ.. 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు!

డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలను పంపించింది.

Updated : 03 Nov 2021 16:19 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డెంగీ కలవరపెడుతోంది. గతకొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, హరియాణా, దిల్లీల్లో డెంగీతో చిన్నారులు మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. డెంగీ నివారణకు సాంకేతిక సహాయం అందించడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాలకు ఈ బృందాలు సూచనలు చేయనున్నాయి.

దేశరాజధాని దిల్లీతోపాటు హరియాణా, పంజాబ్‌, కేరళ, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ)తోపాటు నేషనల్‌ వెక్టార్‌ బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం నిపుణులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ముఖ్యంగా డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజారోగ్యానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించడంతో పాటు వ్యాధి కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకోనున్నారు. ఈ సమయంలో రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించడంతోపాటు పలు జాగ్రత్తలను వివరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించనున్నారు.

ఇదిలా ఉంటే, దేశరాజధాని దిల్లీలోనే ఈ ఏడాదిలో 1530 డెంగీ కేసులు బయటపడ్డాయి. వీటిలో కేవలం ఒక్క అక్టోబర్‌ నెలలోనే 1200 కేసులు వెలుగు చూశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గడిచిన నాలుగేళ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా డెంగీ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సదురు మంత్రిత్వశాఖ పేర్కొంది. దిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో డెంగీ వ్యాప్తి అధికంగా ఉన్న 200 జిల్లాలను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ఇదే సమయంలో డెంగీపై అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు.. వేగంగా వ్యాధి నిర్ధరణ పరీక్షలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర బృందాలు సూచించనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని