Omicron: మధ్యప్రదేశ్‌, హిమాచల్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసులు

ఒమిక్రాన్‌ వేరియంట్‌ తాజాగా మరో రెండు రాష్ట్రాలకు వ్యాపించింది. మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి......

Published : 26 Dec 2021 19:04 IST

దిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో రెండు రాష్ట్రాలకు ఈ వేరియంట్‌ వ్యాపించింది. మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. కాగా వీరంతా విదేశీయులేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వారిలో ముగ్గురు అమెరికా వాసులు, బ్రిటన్‌, టాంజానియా నుంచి ఇద్దరి చొప్పున, ఒకరు ఘనా దేశ వాసులని స్పష్టం చేసింది. కాగా ఇందులో ఆరుగురికి ప్రస్తుతం నెగెటివ్‌గా తేలిందని, వారిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ కూడా చేసినట్లు వెల్లడించింది. మిగతా ఇద్దరిలో ఎలాంటి లక్షణాలు లేవని, వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.

కెనడా నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌కు వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌గా నిర్ధరణ అయ్యింది. ఈ రెండు రాష్ట్రాలతో కలిపి మొత్తం 19 రాష్ట్రాలకు ఈ వేరియంట్‌ సోకినట్లయ్యింది. ఇదిలా ఉండగా దేశంలో ఇప్పటివరకు 422 ఒమిక్రాన్‌ కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం పేర్కొంది. ప్రస్తుతం ఈ తొమ్మిది కేసులతో ఆ సంఖ్య 431కు చేరినట్లయ్యింది. అత్యధికంగా మహారాష్ట్రలో 108, దిల్లీలో 79 కేసులు నమోదయ్యాయి.

కొత్త వేరియంట్‌ కేసులు పెరిగిపోతుండటంతో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వెల్లడించారు. ఒమిక్రాన్‌ రకం కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో భయపడాల్సిన పని లేకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై ‘ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోసు’ టీకా అందించనున్నామని, ఆరోగ్య విభాగ సిబ్బందికి జనవరి 10 నుంచి ఇది వేయడం ప్రారంభమవుతుందని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని