Omicron: దేశ రాజధానిలోఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి..?

ఎటువంటి ప్రయాణ చరిత్ర లేనివారు ఒమిక్రాన్ వేరియంట్ బారినపడుతున్నారని, అది సామాజిక వ్యాప్తిని సూచిస్తోందని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. 

Updated : 30 Dec 2021 16:24 IST

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో 46 శాతం కొత్త వేరియంట్ కేసులే

దిల్లీ: ఎటువంటి ప్రయాణ చరిత్ర లేనివారు ఒమిక్రాన్ వేరియంట్ బారినపడుతున్నారని, అది సామాజిక వ్యాప్తిని సూచిస్తోందని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తాజా జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదిక ప్రకారం నమూనాల్లో 46 శాతం ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూసినట్లు మంత్రి వెల్లడించారు.  దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యికి చేరువైన తరుణంలో మంత్రి వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఒక్క దిల్లీలోనే 260కి పైగా కొత్త వేరియంట్ కేసులున్నాయి. 

దిల్లీలో నిన్న 923 మందికి కరోనా సోకింది. డిసెంబర్ 20న 91 కేసులుండగా.. అకస్మాత్తుగా 900 దాటాయి. మే 30 తర్వాత ఇవే అత్యధిక కేసులు. అలాగే అంతకు ముందు రోజు కంటే 86 శాతం అధికంగా నమోదయ్యాయి. ఆరు నెలల తర్వాత పాజిటివిటీ రేటు ఒక శాతం దాటేసింది. ప్రస్తుతం 1.29 శాతంగా ఉంది. కేసుల ఉద్ధృతిని గమనించిన దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఎల్లో అలర్ట్‌ను ప్రకటించి.. ఆంక్షలను కఠినతరం చేసింది.

‘దేశవ్యాప్తంగా దిల్లీనే కఠిన చర్యలు తీసుకుంది. ఇక్కడ కఠిన ఆంక్షలున్నాయని చెప్తున్నవారు ముందుజాగ్రత్తగా ఉండటం మంచింది. అంతర్జాతీయ స్థాయి ప్రయాణికులు అధికంగా దిల్లీకి వస్తారు. కేంద్రం ముందుగానే అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించి ఉంటే.. ఒమిక్రాన్ దేశంలోకి ప్రవేశించేదే కాదు’ అని వెల్లడించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని