Supreme Court: ఆ 40 అంతస్తుల టవర్లను కూల్చేయండి: సుప్రీంకోర్టు ఆదేశం 

యూపీలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ జంట భవంతులను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Updated : 31 Aug 2021 19:11 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో నోయిడాలోని అక్రమ ఇళ్ల నిర్మాణంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 40 అంతస్తుల జంట భవనాలను (ట్విన్ టవర్స్‌) కూల్చివేయాలని మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. నోయిడా అధికారుల పర్యవేక్షణలో మూడు నెల్లల్లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని తేల్చిచెప్పింది. దీనిపై గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సూపర్ టెక్‌ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరిగింది. 

భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్లను ఇద్దరు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఈ రోజు విచారించింది. ఈ అక్రమ భవన నిర్మాణాన్ని తప్పుబట్టింది. ఈ నిర్మాణం విషయంలో నోయిడా అధికారులు, నిర్మాణ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రశ్నించింది. డెవలపర్లు, పట్టణ ప్రణాళిక అధికారుల సహకారంతో పట్టణ  ప్రాంతాల్లో అనధికారిక నిర్మాణాల సంఖ్య పెరిగిందని, దీనిపై కఠినంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఈ ప్రాజెక్టులో ఇళ్లు కొనుగోలు చేసిన వారికి రెండు నెలల్లో చెల్లింపులు చేయాలని ఆదేశించింది. అలాగే కూల్చివేత ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని, ఆ ఖర్చు మొత్తాన్ని సూపర్‌టెక్ భరించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు టవర్లలో దాదాపు వెయ్యి ప్లాట్లు ఉండగా.. ప్లాట్లు కొన్న వారందరికీ 12 శాతం వడ్డీతో నగదు తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని