Omicron variant: యూకేలో ఒమిక్రాన్‌ సామాజిక వ్యాప్తి!

తమ దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్ సామాజిక వ్యాప్తి మొదలైనట్లు యూకే తాజాగా వెల్లడించింది. యూకేలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ సామాజికంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్ వైద్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ వెల్లడించారు.....

Published : 07 Dec 2021 18:22 IST

లండన్‌: దక్షిణాఫ్రికాలో మొదట వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్‌ అత్యంత వేగంగా పలు దేశాలకు విస్తరిస్తోంది. స్థానికంగానూ కేసులు పెరుగుతున్నాయి. తమ దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్ సామాజిక వ్యాప్తి మొదలైనట్లు యూకే తాజాగా వెల్లడించింది. యూకేలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ సామాజికంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్ వైద్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో 336 ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్లు తెలిపిన సాజిద్‌.. వీటిల్లో 261 కేసులు ఇంగ్లాండ్​లోనే బయటపడ్డాయని స్పష్టం చేశారు. స్కాట్లాండ్​లో 71, వేల్స్​లో 4 కేసులు వెలుగులోకి వచ్చాయని వివరించారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఎటువంటి సంబంధం లేనివారు కూడా ఉన్నారని బ్రిటన్ ప్రతినిధుల సభకు అందించిన నివేదికలో జావిద్ పేర్కొన్నారు. ఈ నివేదిక ద్వారా సామాజిక వ్యాప్తి ఉందని స్పష్టమవుతోందని సభకు వెల్లడించారు. కొత్త వేరియంట్‌​ను అడ్డుకునేందుకు తాము ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదని ఆయన తెలిపారు. ఒమిక్రాన్‌ ప్రమాదకరమా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ వేరియంట్‌ టీకాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేదీ స్పష్టంగా తెలియదని చెప్పారు. శాస్త్రవేత్తలు దీనిపై నిర్ధరణకు వచ్చేంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వెల్లడించారు.

ఆస్ట్రేలియాలోనూ..

తమ దేశంలో ఒమిక్రాన్‌ సామాజిక వ్యాప్తి మొదలైనట్లు ఆస్ట్రేలియా అధికారులు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద నగరమైన సిడ్నీలోని ఐదుగురు స్థానికుల్లో ఒమిక్రాన్‌ బయటపడినట్లు తెలిపారు.వీరిలో రెండు పాఠశాలలు, వ్యాయామశాలలకు సంబంధించిన వారు ఉన్నట్లు తెలిపారు. న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో 15 మందికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని