women in NDA: మహిళలకు సైన్యంలో సమన్యాయం..ఎన్‌డీఏలో ప్రవేశాలకు కేంద్రం అనుమతి

నేషనల్‌ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో మహిళల ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది

Updated : 08 Sep 2021 15:30 IST

దిల్లీ: నేషనల్‌ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో మహిళల ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. త్రివిధ దళాల అధిపతులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. గతంలో ఈ పరీక్షకు మహిళా అభ్యర్థులను అనుమతించకపోవడంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం మహిళలను పరీక్షకు అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్రం వెల్లడించింది.

ఈ విషయంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ..‘గత విచారణలోనే ఈ నిర్ణయం తీసుకుంటే మేం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. మీరేం చేస్తారో.. భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారో, మా నుంచి ఎలాంటి ఆదేశాలు అవసరమవుతాయో మీరు అఫిడవిట్ దాఖలు చేయాలి’ అని కేంద్రానికి సూచించింది. దేశంలో మహిళలకు శాశ్వత కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే దానిపై టైమ్‌లైన్‌ను కోరింది.

దీనిపై అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య బాతి మాట్లాడుతూ.. ‘ఎన్‌డీఏ, నేవీ అకాడమీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఇవ్వాలని త్రివిధ దళాల అధిపతులు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాయి. ఇది చాలా గొప్ప వార్త’ అని తెలిపారు. “స్త్రీ,పురుష సమానత్వంపై సాయుధ దళాలు మరింత కృషి చేయాల్సి ఉంది. సాయుధ దళాల అధిపతులు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను” అని జస్టిస్ ఎస్‌కే కౌల్ పేర్కొన్నారు. కాగా దేశ రక్షణ సేవల్లో మహిళలు షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్‌లుగా నియమితులవుతారు. పురుషులకు ఇచ్చే విధంగానే షార్ట్ సర్వీస్ కమిషన్‌ నుంచి శాశ్వత కమిషన్‌లోకి మారే అవకాశాన్ని మహిళలకు ఇవ్వాలని 2020 మార్చిలోనే సుప్రీం కోర్టు ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని