Pilots death: రెండు రోజులు.. ఇద్దరు భారత పైలట్ల మృతి

రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు భారత పైలట్లు ప్రాణాలు విడిచారు. ఒకరు విమానంలోనే గుండెపోటుకు గురికాగా.. మరొకరు విమానాశ్రయంలో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.

Published : 17 Aug 2023 16:11 IST

దిల్లీ: రెండు రోజుల వ్యవధిలో భారత్‌కు చెందిన ఇద్దరు పైలట్లు(Pilots) వేర్వేరు ఘటనల్లో మృతిచెందడం విషాదం రేపింది. ఒకరు విమానాశ్రయంలో ప్రాణాలు కోల్పోగా.. మరొకరు విమానంలో ప్రయాణిస్తూ గుండెపోటు(Heart Attack)తో మృతిచెందారు. వీరిద్దరి మరణాలను డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(DGCA) ధ్రువీకరించింది. వివరాల్లోకి వెళ్తే..  ఇండిగో కెప్టెన్‌ ఈరోజు నాగ్‌పూర్‌లోని విమానాశ్రయంలో బోర్డింగ్ గేటు వద్ద స్పృహతప్పి పడిపోయారు. నాగ్‌పుర్‌ నుంచి పుణెకు వెళ్లాల్సి ఉన్న తరుణంలో విమానాశ్రయానికి చేరుకున్న ఆయన బోర్డింగ్‌ గేటు వద్దకు చేరుకోగానే అక్కడ ఒక్కసారిగా స్పృహకోల్పోయి కుప్పకూలిపోయారు. అనంతరం సిబ్బంది ఆయన్ను  హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇకపోతే, ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన పైలట్‌ దిల్లీ-దోహా విమానంలో అదనపు సిబ్బందిగా ప్రయాణీకుల క్యాబిన్‌లో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. 

విమానం గాల్లో ఉండగా.. బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్‌

తాజాగా అమెరికాలో ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. అమెరికాలోని మియామీ నుంచి చిలీకి 271 మందితో బయల్దేరిన విమానంలో పైలట్‌ బాత్‌రూమ్‌లో హఠాత్తుగా కుప్పకూలి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన కో-పైలట్లు విమానాన్ని పనామాలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు విమానాశ్రయంలోని వైద్య నిపుణులు ధ్రువీకరించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు