UPSC: యూపీఎస్సీ ఫలితాలు.. ఒకే నెంబర్‌.. ఒకే ర్యాంక్‌.. ఇద్దరు అభ్యర్థులు!

ఇటీవల విడుదలైన యూపీఎస్సీ (UPSC) ఫలితాల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళా అభ్యర్థులకు ఒకే ర్యాంకు వచ్చింది. వాళ్లిద్దరి రోల్‌నెంబర్లు కూడా ఒకటే కావడం గమనార్హం.

Updated : 25 May 2023 20:17 IST

భోపాల్‌: సివిల్‌ సర్వీస్‌ (Civil Service) సాధించడం చాలా మంది కల. దాని కోసం రాత్రింబవళ్లు కష్టపడతారు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతారు. ఎంపిక జాబితాలో తమ పేర్లు కనిపించగానే కష్టాన్నంతా మర్చిపోతారు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యూపీఎస్సీ పరీక్ష (UPSC) కోసం నిరంతరం సాధన చేస్తూనే ఉంటారు. దేశంలో అత్యున్నత సర్వీసుల్లో నియామకం కోసం జరిగే ఈ పరీక్షకు ఎంపికై.. చివర్లో అడ్డంకి ఏర్పడితే ఆ బాధ వర్ణనాతీతం. మధ్యప్రదేశ్‌లోని (Madhya pradesh) ఇద్దరు మహిళా అభ్యర్థులకు సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది.

ఇటీవల వెల్లడించిన యూపీఎస్సీ వెల్లడించిన ఫలితాల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల అయేషా ఫాతిమా, 26 ఏళ్ల అయేషా మక్రాని ఇద్దరూ 184వ ర్యాంకు సాధించారు. వాళ్లిద్దరి రోల్‌ నెంబర్లు కూడా ఒకటే. ఇక్కడే చిక్కొచ్చిపడింది. వాళ్లిద్దరూ నిజమైన ర్యాంకర్‌ నేనంటే నేనంటూ యూపీఎస్సీకి తమ అడ్మిట్‌ కార్డులను సమర్పించారు. అంతేకాకుండా స్థానిక పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. ఎక్కడో పొరపాటు జరిగిందని తమకు న్యాయం చేయాలని ఇద్దరూ యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు.

‘‘ నేను రెండేళ్ల పాటు కష్టపడి చదివాను. నా ఉద్యోగాన్ని వేరేవాళ్లకి ఇస్తానంటే ఒప్పుకొనేదే లేదు. సరైన చర్యలు తీసుకొని యూపీఎస్సీ, కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి’’ అని మక్రానీ మీడియాకు తెలిపారు. ఫాతిమా మాట్లాడుతూ.. తన ర్యాంకు, రోల్‌నెంబర్‌తో మరో అభ్యర్థి ఉన్నారని తెలిసి షాక్‌కు గురయ్యానని అన్నారు. ‘‘ మోసం జరిగేందుకు అవకాశాలు లేవు. యూపీఎఎస్సీ బోర్డు నిర్ణయాన్ని బట్టి ఏం చెయ్యాలో ఆలోచిస్తాను’’ అని అన్నారు.

యూపీఎస్సీ ఏం చెబుతోంది?

వాళ్లిద్దరి అడ్మిట్‌కార్డులను నిశితంగా పరిశీలించినట్లయితే కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పర్సనాలిటీ టెస్టు (ఇంటర్వ్యూ) నిర్వహించిన తేదీ ఇక్కడ కీలకంగా మారింది. వీరిద్దరికీ ఏప్రిల్‌ 25, 2023న పర్సనాలిటీ టెస్టు నిర్వహించారు. అయితే, మాక్రానీ అడ్మిట్‌ కార్డులో గురువారం అనీ, ఫాతిమా కార్డులో మంగళవారం అని రాసి ఉంది. క్యాలెండర్‌ ప్రకారం ఆ రోజు మంగళవారమే. అంతేకాకుండా ఫాతిమా అడ్మిట్‌ కార్డులో యూపీఎస్సీ వాటర్‌మార్కుతోపాటు, క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంది. మాక్రానీ అడ్మిట్‌ కార్డుపై అవేం కనిపించడం లేదు. మరోవైపు యూపీఎస్సీ అధికారులు కూడా ఫాతిమానే అసలు అభ్యర్థి అని చెబుతున్నారు. అలాగని మక్రానీని కూడా తప్పుబట్టలేమని, పొరపాటు ఎక్కడ జరిగిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు. 

దేశంలోనే యూపీఎస్సీ పరీక్షకు అత్యంత పోటీ ఉంటుంది. ప్రతియేటా జారీ చేసే దాదాపు 800 పోస్టులకు లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. మూడు దశల్లో (ప్రిలిమినరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూ) పరీక్షలు నిర్వహించి అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు దాదాపు ఏడాది సమయం పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని