Lockdown: యూపీలో సడలింపులు!

రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను జూన్ 1 నుంచి క్రమంగా సడలించనున్నట్లు ప్రకటించింది.....

Updated : 21 Dec 2022 15:32 IST

లఖ్‌నవూ: రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను జూన్ 1 నుంచి క్రమంగా సడలించనున్నట్లు ప్రకటించింది. తొలుత 600 కంటే తక్కువ క్రియాశీలక కేసులు ఉన్న జిల్లాలు, నగరాల్లో కఠిన ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఆయా జిల్లాల్లో వారంలో ఐదు రోజులు అన్ని దుకాణాలు, మార్కెట్లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచేందుకు అనుమతించనుంది. వారాంతంలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో మార్కెట్లు, దుకాణ సముదాయ ప్రాంతాల్లో శానిటైజ్‌ చేస్తామని తెలిపింది. 

దుకాణదారులు, మార్కెట్‌ నిర్వహకులు భౌతిక దూరం, మాస్కు ధరించడం వంటి నిబంధనల్ని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని యూపీ సర్కార్‌ ఆదేశించింది. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక ఫ్రంట్‌లైన్‌ సేవల్లో పాల్గొనే కార్యాలయాల్లో మాత్రమే మొత్తం సిబ్బంది హాజరు కావాలని తెలిపింది. మిగిలిన ప్రభుత్వ విభాగాలు 50 శాతం మంది సిబ్బందితోనే కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించింది. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు మాత్రం మూసే ఉంటాయని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని