వ్యాక్సిన్‌ ఫ్రీగా ఇవ్వాలి: సుప్రీం మెట్లెక్కిన బెంగాల్‌!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సినేషన్‌ పాలసీని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టింది......

Published : 08 May 2021 01:12 IST

దిల్లీ‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సినేషన్‌ పాలసీని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టింది. దేశమంతా ఒకే వ్యాక్సినేషన్‌ విధానం ఉండాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్రాలకు, ప్రైవేటు వ్యక్తులకు ఒక్కోలా ధర నిర్ణయించేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన టీకా విధానాన్ని రద్దు చేయాలని కోరింది. అలాగే, దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు బ్రహ్మాస్త్రంగా నిలుస్తున్న ఈ వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగానే పంపిణీ చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. రాష్ట్రాలకు వ్యాక్సిన్ల కొరత తీర్చడంతో పాటు ఉచితంగా సరఫరా చేసేలా కేంద్రం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. వ్యాక్సినేషన్‌ పాలసీ సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది.

దేశంలో మే 1 నుంచి 18ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, టీకాల ధరల్లో తేడాపై పలు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. సీరం సంస్థ పంపిణీ చేస్తున్న కొవిషీల్డ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400లకు ఒక డోసును పంపిణీ చేస్తుండగా.. ప్రైవేటు ఆస్పత్రులకు ఒక్కో డోసును రూ.600లకు ఇస్తోంది. అలాగే, భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకా రాష్ట్రాలకు రూ.600, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1200ల చొప్పున సరఫరా చేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయంతెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని