Job Offers: థాయ్‌లాండ్‌లో ఐటీ జాబ్‌ ఆఫర్లా.. జాగ్రత్త..!

విదేశాల్లో ఐటీ ఉద్యోగాలంటూ నకిలీ జాబ్‌ రాకెట్ల వలలో పడదొద్దంటూ దేశ యువతను కేంద్ర విదేశాంగశాఖ హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చినప్పుడు

Published : 24 Sep 2022 17:10 IST

దిల్లీ: విదేశాల్లో ఐటీ ఉద్యోగాలంటూ నకిలీ జాబ్‌ రాకెట్ల వలలో పడవద్దంటూ దేశ యువతను కేంద్ర విదేశాంగశాఖ హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చినప్పుడు సంబంధిత కంపెనీ పూర్తి వివరాలు తెలుసుకున్నాకే వెళ్లాలని సూచించింది. ఉద్యోగాల పేరుతో మోసపోయి కొంతమంది భారతీయులు మయన్మార్‌లో చిక్కుకున్నట్లు వస్తోన్న వార్తల నేపథ్యంలో విదేశాంగ శాఖ శనివారం ఈ అడ్వైజరీ జారీ చేసింది.

‘‘థాయ్‌లాండ్‌లో కొన్ని అనుమానాస్పద ఐటీ సంస్థలు భారత యువతకు ఆకర్షణీయమైన జీతంతో ఆఫర్లు ఇస్తున్న నకిలీ జాబ్‌ రాకెట్‌ ఉదంతాలు ఇటీవల బ్యాంకాక్‌, మయన్మార్‌లోని భారత దౌత్యకార్యాలయాల దృష్టికి వచ్చాయి. ఐటీ నైపుణ్యాలున్న యువతను లక్ష్యంగా చేసుకుని దుబాయి, భారత్‌ ఆధారంగా పనిచేస్తోన్న కొన్ని రిక్రూటింగ్‌ ఏజెన్సీలు ఈ రాకెట్‌ నడిపిస్తున్నాయి. డిజిటల్‌ సేల్స్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, డేటా ఎంట్రీ ఉద్యోగాలంటూ సోషల్‌మీడియాలో ప్రకటనలిచ్చి ఎక్కువ జీతం అంటూ యువతను ఆకట్టుకుంటున్నారు. ఆ తర్వాత అక్రమంగా దేశం దాటిస్తున్నారు. ఇలాంటి ఏజెంట్ల చేతిలో మోసపోయి అనేక మంది విదేశాల్లో దారుణమైన పరిస్థితుల్లో బందీలుగా ఉండాల్సి వస్తోంది’’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది.

సోషల్‌ మీడియాలో వచ్చే ఇలాంటి నకిలీ జాబ్‌ ఆఫర్ల వలలో పడొద్దని విదేశాంగ శాఖ సూచించింది. ‘‘ఉపాధి కోసం టూరిస్టు లేదా విజిట్‌ వీసాపై విదేశాలకు వెళ్లే ముందు.. ఒక్కసారి ఆయా కంపెనీల వివరాలను సంబంధిత దేశంలోని దౌత్య కార్యాలయం నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలి’’ అని కేంద్రం ఈ సందర్భంగా యువతను స్పష్టం చేసింది.

థాయ్‌లాండ్‌లో ఉద్యోగాలంటూ అంతర్జాతీయ నకిలీ జాబ్‌ రాకెట్‌ వలలో మోసపోయి మయన్మార్‌లో చిక్కుకుపోయిన భారతీయుల వీడియో ఒకటి ఇటీవల బయటికొచ్చిన విషయం తెలిసిందే. ఐటీ ఉద్యోగాలంటూ తమను దేశం దాటించి.. అక్కడ తమతో బలవంతంగా చట్టవ్యతిరేక పనులు చేయిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో ఎక్కువ మంది తమిళనాడుకు చెందిన వారే ఉన్నారు. దీంతో ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌.. ప్రధాని మోదీకి లేశారు. ఈ క్రమంలోనే చర్యలు చేపట్టిన కేంద్ర విదేశాంగ శాఖ.. మయన్మార్‌లో చిక్కుకున్న 30 మందిని రక్షించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని