Partha Chatterjee: కోర్టులో ఏడ్చేసిన పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీ

పాఠశాల ఉద్యోగుల నియామకం కుంభకోణంలో అరెస్టయి తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ కోర్టులోనే ఏడ్చేశారు. రాజకీయాలకు బలిపశువునయ్యానని కోర్టులో వాపోయారు.........

Published : 15 Sep 2022 02:08 IST

ఇరువురికి మరో 14రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

కోల్‌కతా: పాఠశాల ఉద్యోగుల నియామకం కుంభకోణంలో అరెస్టయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ (Partha Chatterjee) కోర్టులోనే ఏడ్చేశారు. రాజకీయాలకు బలిపశువునయ్యానని కోర్టులో వాపోయారు. ఇకపై ప్రశాంతంగా జీవించాలని ఉందన్నారు. ఆయన సన్నిహితురాలైన సినీనటి  అర్పితా ముఖర్జీ (Arpita Mukherjee) సైతం కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు. ఇదంతా ఆశ్చర్యంగా ఉందని.. అంత డబ్బు తన ఇంట్లో ఎక్కడ దొరికిందో తెలియడం లేదన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం వారిద్దరికీ  మరో 14రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించింది. 

ఈ కుంభకోణంలో అరెస్టుల అనంతరం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఛటర్జీ, అర్పితా ముఖర్జీ నేడు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణలో ఛటర్జీ మాట్లాడుతూ.. ‘పబ్లిక్‌లో నా ఇమేజ్ గురించి చాలా ఆందోళన చెందుతున్నా. నేనో ఎకనామిక్స్‌, ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని. బ్రిటిష్ స్కాలర్‌షిప్ కూడా పొందాను. ఉన్నత విద్య చదివిన నేను ఇలాంటి కుంభకోణంలో ఎలా భాగం కాగలను?’ అంటూ కోర్టులో వాపోయారు. మంత్రి  కాకముందు తాను ప్రతిపక్ష నేతనని, కానీ ఇప్పుడు రాజకీయాలకు బలిపశువునయ్యానన్నారు. బెయిల్‌ మంజూరు చేయాలంటూ కోర్టును అభ్యర్థించారు. ‘నాకు ప్రశాంతంగా జీవించాలనుంది. నా జీవితాన్ని నేను గడిపేలా అనుమతించండి. నాకు బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కోరుతున్నా’ అని అన్నారు.

అంత డబ్బు నా ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియదు

ఛటర్జీ విచారణ అనంతరం అర్పితా ముఖర్జీని సైతం కోర్టులో హజరుపర్చగా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావడంలేదు. అంత డబ్బును నా ఇంట్లో నుంచి ఈడీ అధికారులు ఎలా స్వాధీనం చేసుకున్నారో తెలియడంలేదు’ అని అన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘ఆ ఇంటి యజమాని మీరే కదా?’ అని ప్రశ్నించారు. దానికి అర్పిత ‘ఔను’ అని సమాధానం చెప్పగా.. ‘అయితే దానికి మీరే సమాధానం చెప్పాలి’ అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వాదనలు విన్న కోర్టు వారికి మరో 14 కస్టడీ విధించింది.

ఇదీ కేసు..

2014-2021 మధ్య కాలంలో పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉండగా బెంగాల్‌ ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిపై దాడి చేసిన ఈడీ అధికారులు.. ఆయన సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ నివాసంపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా అర్పిత నివాసాల్లో రూ.50కోట్లకుపైగా విలువైన కరెన్సీ నోట్ల కట్టలు, భారీగా బంగారం, కీలక దస్త్రాలు బయటపడ్డాయి. వాటిని సీజ్‌ చేసిన అధికారులు విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని